కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు వాయిదా వేయవద్దని, కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు జరపాలని అన్ని రాజకీయ పార్టీలు కోరడంతో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు జరుపుతామని భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు.
ఎన్నికలను నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ బృందం మంగళవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది. సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే మంగళవారం జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరారు. పోలింగ్ సమయంలో కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించాలని కోరారు.
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమను కలిశారని, కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ, శాసన సభ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని కోరారని సుశీల్ చంద్ర గురువారం లక్నోలో మీడియాతో చెప్పారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని చెప్పారు. పోలింగ్‌ను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
అన్ని పోలింగ్ బూత్‌లలోనూ VVPATలను అమర్చుతామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం దాదాపు 1 లక్ష పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 59% ఓటింగ్ నమోదైంది.
ప్రజల్లో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉందనేది ఆందోళన కలిగించే విషయమని సుశీల్ చంద్ర చెప్పారు. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచనున్నట్లు సీఈసీ తెలిపింది.
“ఇంతకుముందు, 1,500 మంది ఓటర్లకు ఒక బూత్ ఉండెడిది. కానీ కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి బూత్‌లో ఓటర్ల సంఖ్య 1,250 కు తగ్గిస్తున్నాము. దీని కారణంగా, పోలింగ్ బూత్‌ల సంఖ్య 11,000 పెరిగింది. కాబట్టి, మొత్తం ఉత్తరప్రదేశ్‌లో 1,74,351 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నాము” అని ఆయన వివరించారు.
పోలింగ్ అధికారులకు వ్యాక్సిన్ వేయడంతోపాటు అర్హులైన వారికి బూస్టర్ డోస్ కూడా ఇస్తారు. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద థర్మల్ స్కానర్లు, మాస్క్‌లు అందజేస్తామని, బూత్‌లలో సరైన శానిటైజేషన్‌తో పాటు సామాజిక దూరాన్ని నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఆయన చెప్పారు.
దాదాపు 5,000 మంది పోలీసులను బదిలీ చేశామని, మిగిలిన వారిని త్వరలో బదిలీ చేస్తామని సీఈసీ తెలిపారు. 4,030 మోడల్ పోలింగ్ బూత్‌లు ఉంటాయి– ఒక్కో నియోజకవర్గంలో 10 –. అలాగే 800 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి సారిగా, సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు వారి ఇళ్ల నుండి ఓటు వేసే అవకాశం ఉంటుందని చంద్ర తెలిపారు. జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికల కమిషన్ బృందం బుధవారం జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు చీఫ్స్, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైంది. శాసన సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, శాంపిల్ టెస్ట్‌లను పెంచాలని, కోవిడ్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఓమిక్రాన్ వ్యాపిస్తుండడంతో ఎన్నికలను రెండు, మూడు నెలలపాటు వాయిదా వేయమని అలాహాబాద్ హైకోర్టు ఎన్నికల కమీషన్ కు సూచించింది. ఎన్నికల కమిషన్ సోమవారం న్యూఢిల్లీలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఒమైక్రాన్ వ్యాప్తి పరిస్థితులు, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యల గురించి చర్చించింది.