మణిపూర్లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్లో కూడా అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య వాగ్యుద్ధం మరింత ముదిరింది.
పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో మూడు, నాలుగు రోజుల క్రితం స్థానిక మహిళా వ్యాపారులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిద్దరూ దొంగతనం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారి శరీరం పైభాగంలోని వస్త్రాలను తొలగించి, కొట్టారు. అయితే అటు వ్యాపారులు కానీ, ఇటు బాధిత మహిళలు కానీ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
ఈ వీడియో తమ దృష్టిలో పడిన తర్వాత మాత్రమే ఈ సంఘటన గురించి తమకు తెలిసిందని పోలీసులు చెప్తున్నారు. బాధితులు పారిపోగా, వారిని పట్టుకున్నవారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. ఈ సంఘటన ఇటీవలే పకుహట్ ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, తగిన చర్య తీసుకుంటామని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో భయోత్పాతం కొనసాగుతోందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. మాల్డాలోని బమన్గోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, నిర్దయగా హింసించి, కొట్టారని ఆరోపించారు. పోలీసులు మౌన ప్రేక్షకులుగా మారిపోయారని మండిపడ్డారు. పకువా హట్ ఏరియాలో జూలై 19న ఈ దారుణం జరిగినట్లు ఆయన తెలిపారు.
బాధిత మహిళలు సాంఘికంగా అణగారిన వర్గాలకు చెందినవారని, పిచ్చిపట్టిన మూక ఆ మహిళల రక్తం తాగడం కోసం వెర్రిగా తహతహలాడిందని బిజెపి నేత మండిపడ్డారు. ఈ విషాదకర సంఘటన ముఖ్యమంత్రి మమత బెనర్జీ హృదయాన్ని పగులగొట్టి ఉంటుందని ఎద్దేవా చేశారు.
ఆమె రాష్ట్రానికి హోం మంత్రి కూడా కాబట్టి కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా, చర్య తీసుకుని ఉండాలని పేర్కొన్నారు. కానీ ఏమీ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారని దుయ్యబట్టారు. ఈ ఆటవికతను ఆమె ఖండించలేదని, బాధ, ఆవేదనలను వ్యక్తం చేయలేదని, అలా చేస్తే తాను ముఖ్యమంత్రిగా విఫలమైనట్లు బయటపడిపోతుందని భావించారని ఎద్దేవా చేశారు. కానీ ఓ రోజు తర్వాత ఆమె భోరున విలపించారని, కన్నీళ్లు కార్చారని, రాజకీయంగా అవసరం కాబట్టి అలా చేశారని తెలిపారు.