భర్త లంచాలు పుచ్చుకున్న అభియోగాలతో అరెస్టు కావడంతో మరుసటి రోజు ఆయన భార్య జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేష్ గుర్జర్‌ను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అర్థరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు వెలువరించింది.
భూముల లీజు గురించి మేయర్ భర్త సుశీల్ గుర్జర్‌ను రాష్ట్ర ఎసిబి శనివారం అరెస్టు చేసింది. భార్య మేయర్ కావడంతో ఆమె పేరు మీద పనులు చేయిస్తానని భర్త ఈ లంచాలు తీసుకున్నట్లు తేలింది. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆమెను మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసింది. స్థానిక కార్పొరేషన్‌లోని వార్డు నెంబరు 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా తాత్కాలికంగా తీసివేశారు.
మేయర్ మునేష్ గుర్జార్ భర్త సుశీల్.. ఓ భూమి లీజ్ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ నిన్న ఎసిబికి దొరికిపోయాడు. ఆ ఇంటి నుండి ఎసిబి అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మేయర్ మునేష్ గుర్జార్ కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా ఏసీబీ అరెస్టు చేసి విచారిస్తోంది.
మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన ఓ మేయర్ ఈ విధంగా ఏసీబీకి పట్టుబట్టడం అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నది. ఇప్పటికే ఓ మాజీ మంత్రి అసెంబ్లీలో వెల్లడించిన `రెడ్ డైరీ’ ఆధారంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై బిజెపి తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నది.