రాజస్ధాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోపించారు. మధ్యాహ్న భోజన పధకం, మైనింగ్ సహా ఎన్నో స్కామ్‌లతో కాంగ్రెస్ సర్కార్ భ్రష్టుపట్టిందని ధ్వజమెత్తారు. అశోక్ గెహ్లాట్ సర్కార్ అత్యంత అవినీతిమయ సర్కార్ అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
యోజన భవన్‌లోని బేస్మెంట్లో కిలో బంగారం బయటపడిన నేపధ్యంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగడంతో 16 కిలోల బంగారం దొరికిందని చెబుతూ అవినీతిపై దర్యాప్తు సంస్ధలు చేపట్టినప్పుడల్లా సీఎం మొసలి కన్నీరు కారుస్తున్నారని, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని కేకలు పెడుతుంటారని దుయ్యబట్టారు.
గెహ్లాట్ క్యాబినెట్ నుంచి ఇటీవల తొలగించిన రాజేంద్ర గుధ రెడ్ డైరీ గురించి వెల్లడించడాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అవినీతిలో అందరూ పాలుపంచుకున్నా చర్యలు చేపట్టడం మొదలవడంతో ఓ మంత్రిని బలి చేశారని పేర్కొన్నారు. గజేంద్ర షెకావత్ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది చివరిలో రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్, బీజేపీ పరస్పరం తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.