ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలకు చర్చకు వచ్చాయి. ఏపీ- తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని నిర్ణయించింది.
ఇక నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు, తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. ములుగు జిల్గాలో సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పసుపు రైతులకు లబ్ధి చేకూరేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటునకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు కృష్ణా ట్రిబ్యూనల్ ఏర్పాటునకు నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటిని ట్రిబ్యూనల్ కేటాయిస్తుందన్నారు. మిగులు జలాలను కూడా ట్రిబ్యూనల్ నిర్ణయిస్తుందని వివరించారు. ములుగు జిల్లాలో రూ. 889 కోట్లతో సమ్మక్క – సారక్క పేరుతో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఇక్కడ జాతీయ పసుపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ములుగు జిల్లాలో జాతీయ గిరిజన వర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక ప్రకటించిన మరుసటి రోజు జరిగిన కేంద్ర కేబినెట్ లో వీటి ఏర్పాటునకు ఆమోదముద్ర వేసింది.
ఇక కీలకమైన ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి ఈ వివాదం ఉండగ వీటిని పరిష్కరించే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించే విధంగా కొత్త ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.