తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని అధికార బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు కాపాడుతోందని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. డబ్బుల సంచులతో దొరికిన రేవంత్‌ను సీఐడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పక్కాగా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎందుకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. కవిత సుప్రీంకోర్టుకు వెళితే న్యాయస్థానం స్టే ఇచ్చిందని, కానీ రేవంత్ పిటిషన్‌ను కొట్టేసినప్పటికీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ పక్కాగా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వంద శాతం బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అయితే జిల్లాలో అన్నీ స్థానాల్లో తామే గెలుస్తున్నామని కవిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎన్నికల్లో స్వతహాగా గెలవలేని కవిత.. ఇతరులను ఎలా గెలిపిస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లాలో అన్నీ స్థానాల్లో బీఆర్ ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కవిత, కేటీఆర్ వల్లే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోరుట్లలోనూ కవిత ప్రచారం చేయాలని అప్పుడే ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతానని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ గురించి బాండ్ పేపర్ రాస్తారా అని ప్రశ్నించగా.. మీరేమంటారు అంటూ ఎదురుప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు అర్వింద్. పోలింగ్, ఎన్నికల ఫలితాల మధ్యలోనే చాలా మంది కాంగ్రెస్ నేతలు జంప్ అవుతారని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్క దగ్గరే అయస్కాంతం లేదని, తమ వద్ద కూడా అయస్కాంతం ఉందని పేర్కొన్నారు. అధికారమే మా పార్టీదేనని, ఉత్తర తెలంగాణలో బీజేపీ క్లీన్ స్విప్ చేస్తుందని జోస్యం చెప్పారు.