ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం సహా ఇతర పద్ధతులపై కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న సరికొత్త విధానం సత్ఫలితాలనిస్తోంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎస్ఎంఎస్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం సాధిస్తూ ఎన్నికల అక్రమాలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేస్తోంది.
ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సీజ్ చేసిన మొత్తం 7 రెట్లు పెరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. మిజోరాంతో, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 1,760 కోట్ల మేర నగదు, మద్యం, డ్రగ్స్, ఖరీదైన బహుమతులను సీజ్ చేసినట్టు ప్రకటించింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన మొత్తం రూ. 239.15 కోట్లతో పోల్చితే ఇది 7 రెట్లు పెరిగిందని గణాంకాలతో సహా వెల్లడించింది. దేశంలోని 5 రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల కమిషన్ అధికారుల తనిఖీలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరంలలో ఎన్నికలు జరగ్గా, రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 25, నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
ఈసీ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయం, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ రూ. 1,400 కోట్ల మేర నగదు, మద్యం, బహుమతులను పట్టుకున్నామని, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది ఏకంగా 11 రెట్లు అధికమని ఈసీ వివరించింది.
తెలంగాణ ఎన్నికల సందర్బంగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.625 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఇప్పటివరకు రూ.99.49 కోట్ల మద్యం,రూ.34.35 కోట్ల మత్తు పదార్థాలు, రూ.78.62 కోట్ల వస్తువులు,రూ.179 కోట్ల విలువ చేసే బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మిజోరాంలో 29.82 కోట్ల విలువైనా డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వ్యయంపై పర్యవేక్షణ కోసం 228 మంది అనుభవజ్ఞలైన ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్, ఐడీఏఎస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అధికారులను నియమించినట్టు తెలిపింది. అదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి ఈ పర్యవేక్షణ అమలు చేసేందుకు తగినంత సిబ్బందిని నియమించినట్టు పేర్కొంది.