జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బాజీ మాల్ అడవుల్లో బుధవారం ఉదయం నుంచి భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బాజీ మాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు అధికారులు, మరో ఇద్దరు సైనికులు అమరుడయ్యాడు. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ ప్రత్యేక బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.
కశ్మీర్‌లోని పీర్ పంజాల్ అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్లతో భద్రతా దళాలకు సవాల్‌గా మారింది. దట్టమైన అడవులను ఉగ్రవాదులు తమ స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రమాదకరమైన పర్వతాలు, దట్టమైన అరణ్యాలు, ఆల్పైన్ అడవులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గత వారం రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి.
ఇదిలా ఉండగా, ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నారనే ఆరోపణతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తాజాగా నలుగురు ప్రభుత్వోద్యోగులను విధుల నుంచి తొలగించింది.