తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక వంక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలతో భేటీలు జరుపుతూ, జాతీయ స్థాయిలో బిజెపిని గద్దె దింపడం గురించి సమాలోచనలు జరుపుతున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఫోన్ చేసి తెలంగాణ రాజకీయ పరిణామాల గురించి దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు.
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను కూడా అడిగి తెలుసుకొంటూ . బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు. సంజయ్ కార్యాలయంపై పోలీసుల దాడికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
ఇప్పటికే కరోనా నిబంధలను అధిగమించి జాగరణ దీక్ష చేపట్టారని అంటూ సంజయ్ ను బెయిల్ ఇవ్వడానికి వీలులేని నిబంధనలతో అరెస్ట్ చేయడం, రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకొని పోలీసులకు చివాట్లు వేసి, విడుదల చేయడం తెలిసింది. ఈ సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దగ్గర నుండి పలువురు అగ్రనాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. వచ్చి పరామర్శించారు.
ఈ చర్యతో తెలంగాణలో బిజెపి ఎదుగుదల పట్ల మొత్తం బిజెపి నాయకత్వం ఆసక్తిగా ఉన్నదనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా కేసీఆర్ పాలనా విధానాలను బిజెపి కేంద్ర నాయకత్వం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయడం పట్లనే కాకుండా, 2023 ఎన్నికలలో అధకారంలోకి తీసుకు వచ్చేందుకు బిజెపి అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.