ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (
పీఎంజీకేఓవై) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్ ఇచ్చే ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
పీఎంజీకేఏవై కింద అంత్యోదయ అన్నయోజన (ఎఎవై) హౌస్‌హోల్డ్స్, ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ (పిహెచ్ హెచ్) లబ్ధిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించే ఈ పథకం 2023 జనవరి 1 న ప్రారంభించారు. కాగా, పీఎంజీకేఏవై పథకం పొడిగింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు.
పేదరికపు రేఖకు ఎగువకు చేరిన వారి సంఖ్య గత ఐదేళ్లలో 13.50 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రవేశపెట్టారని, దీనిని 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని నిర్ణయించారని తెలిపారు.
ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
గత ఏడాది డిసెంబర్లో పీఎంజీకేఏవైని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)తో విలీనం చేయాలని కేంద్రం నిర్మయం తీసుకుంది. ఎన్ఎఫ్సీఏ కింద 75 శాతం గ్రామీణ జనాభా, 50 శాతం పట్టణ జనాభాను ఏఏవై, పీహెచ్‌హెచ్ అనే రెండు కేటగిరిల్లోకి తెచ్చారు.