ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్ట్‌లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దుల వద్ద మంగళవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.
మావోల కార్యకలాపాల పర్యవేక్షణకు టేకులగూడెం గ్రామంలో సెక్యూరిటీ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జోనగూడ-అలిగూడ ప్రాంతంలో పెట్రోలింగ్, సోదాలు చేస్తున్న కోబ్రా- ఎస్టీఎఫ్-డీఆర్జీ దళాలపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డాయి. నక్సల్స్ కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ధీటుగా బదులిచ్చాయి.
దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు సైనికులు వీరమరణం పొందగా.. మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన సైనికుల పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలిస్తున్నారు.
టేకలగూడెం అడవుల్లో 2021లో మావోలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 21 మంది జవాన్లు అమరులయ్యారు. బస్తర్ రేంంజ్ ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ.. 2021లో జరిగిన టేకులగూడెం ఎన్కౌంటర్లో భారీ నష్టాన్ని చవిచూసినా.. శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
భద్రతా బలగాలపై మావోయిస్ట్‌ల జరిపిన ఆకస్మిక ఘోరమైన దాడుల్లో ఇదీ ఒకటి. ఏప్రిల్ 2021లో బిజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ అగ్రనేత కోసం 2 వేల మంది భద్రతా సిబ్బంది గాలిస్తుండగా..వారిపై మావోలు దాడిచేశారు. సుమారు 400 నుంచి 750 మంది సాయుధలైన నక్సల్స్ మూడు వైపుల నుంచి జవాన్లను చుట్టిముట్టిన మావోయిస్ట్‌లు.. మెషీన్ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించి, గ్రనేడ్లు విసిరి భయోత్పాతం సృష్టించారు.
గాయాలైపాలైనవారిని హెలికాప్టర్ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. దేశంలో 60వ దశకం నుంచి మావోయిస్ట్‌ల ఉద్యమం మొదలైంది. పేదలు, బలహీనవర్గాల కోసమే పోరాటం చేస్తున్నట్టు చెప్పుకునే నక్సల్స్.. ప్రభుత్వ దళాలతో ముఖాముఖి తలపడుతుంటారు.