చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్యసహా 14మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎటువంటి కుట్రలేదని త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను భారత వైమానిక దళం(ఐఎఎఫ్) ప్రకటించింది. ప్రమాదం వెనుక కుట్రకోణంగానీ, సాంకేతికలోపంగానీ లేవని నివేదిక పేర్కొన్నది.
వాతావరణంలో అనుకోకుండా చోటు చేసుకున్న మార్పుల వల్ల పైలట్ అయోమయానికి గురి కావడంవల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మాన్వేంద్రసింగ్ నేతృత్వంలో త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ జరిగిన విషయం తెలిసిందే. కమిటీ తమ ప్రాథమిక నివేదికను ఈ నెల మొదటివారంలో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సమర్పించింది.
లోయలోని వాతావరణంలో ఏర్పడ్డ అనూహ్య మార్పుల వల్ల సిడిఎస్ బిపిన్‌రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వి 5 హెలికాప్టర్ మేఘాలలో చిక్కుకోవడంతో హెలికాప్టర్‌పై పైలట్ నియంత్రణ కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారని ఐఎఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదానికి ఎలాంటి సాంకేతిక, యాంత్రిక లోపాలు కారణం కాదని స్పష్టం చేసింది.
హెలికాప్టర్ ప్రమాదంపై నియమించిన కమిటీ స్థానిక ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించిందని తెలిపింది. హెలికాప్టర్ ఫ్లైట్ డేటా రికార్డర్‌తోపాటు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను విశ్లేషించింది. గతేడాది డిసెంబర్ 8న బిపిన్ రావత్‌సహా 14మంది ప్రయాణిస్తున్నహెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో కూలిపోయిన విషయం తెలిసిందే.ఫ్లయిట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను విశ్లేషించడంతో సహా అందబాటులో ఉన్న ప్రత్యక్ష సాక్షులందరినీ విచారించిన తరువాత బృందం ఈ విషయాన్ని తెలియజేసింది.
పైలట్ నియంత్రణలోనే ఉన్న విమానం అకస్మాత్తుగా భూభాగం, నీరు, పర్వతాలను ఢకొీట్టడాన్ని సిఎఫ్ఐటిగా అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), అమెరికా ఫెడరల్ వైమానిక అడ్మినిస్ట్రేషన్ నిర్వచనం ఇస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో విమాన ప్రమాదాలకు ఇదే అత్యధిక కారణంగా వైమానిక నిపుణులు చెబుతుంటారు.
ఈ ప్రమాదంపై దేశంలోని అగ్రశ్రేణి హెలికాప్టర్ పైలట్ ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ట్రై సర్వీసెస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ తన ప్రాథమిక నివేదికను శుక్రవారం సమర్పించింది.
అందులో రావత్, అతని భార్య మధులికా రావత్‌తో పాటు, రావత్ సీనియర్ సిబ్బంది బ్రిగ్ ఎల్ ఎస్ లిడర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఐఎఎఫ్ అధికారులు వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ లతో సహా మరో 12 మంది సాయుధ దళాల సిబ్బందిని తీసుకువెళుతున్నారు. ప్రమాదంలో 14 మంది ప్రయాణీకులలో 13 మంది మరణించగా, దాని నుండి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక వారం తరువాత గాయాలతో మరణించాడు.
డిసెంబర్ 9న, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హెలికాప్టర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుండి ఉదయం 11.48 గంటలకు బయలుదేరిందని, మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్లో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నట్లు పార్లమెంటుకు తెలిపారు. సూలూరు ఎయిర్‌బేస్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మధ్యాహ్నం 12.08 గంటలకు హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.
తమిళనాడులోని కూనూర్ సమీపంలోని అడవిలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు హెలికాప్టర్ శకలాలు మంటల్లో చిక్కుకోవడం గమనించి అక్కడికి చేరుకున్నారని సింగ్ తెలిపారు. నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి రావత్ వెళ్తున్నారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవ్వరిని నియమించలేదు