ఒకప్పుడు గూగుల్ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్నారు.
ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్‌కుమార్, కాంకేర్ సీనియర్ ఎస్పీ ఐ.కళ్యాణ్ ఎలిసెల కథనం ప్రకారం.. ఈ నెల 19న మొదటి దశ లోక్‌సభ పోలింగ్‌లో భాగంగా బస్తర్ రీజియన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్‌లో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు, లేఖలను విడుదల చేస్తున్నారు.
సోమవారం దండకారణ్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు కుట్రలు పన్నారనే సమాచారంతో చోటాబేటియా ఠాణా పరిధిలోని బినాగూడ, చోటాబేటియా అడవుల్లో సోమవారం నుంచి బీఎ్‌సఎఫ్, డీఆర్జీ బలగాలతో కూంబింగ్ ప్రారంభించినట్లు ఈ ఆపరేషన్‌ను ముందుండి నడిపించిన సీనియర్ ఎస్పీ కల్యాణ్(తెలుగు అధికారి) తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 సమయంలో అబుజ్మడ్ ప్రాంతంలో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో.. పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు.
‘‘సాయంత్రం 5.30 వరకు.. సుమారు 4 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోవడంతో.. మా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో.. మొత్తం 29 మంది మావోయిస్టుల మృతదేహాలను కనుగొన్నాం’’ అని ఆయన వివరించారు. వీరిలో శంకర్రావు, సుమన, లలిత, వినోద్‌బావ్డే, మాధవి, లలిత, రాజు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఘటనాస్థలి నుంచి ఒక ఏకే-47, ఒక ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, పాయింట్-303 రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ కాల్పుల్లో బీఎ్‌సఎఫ్ ఇన్స్పెక్టర్ రమేశ్ చౌదరి మోకాలికి, డీఆర్జీ కానిస్టేబుల్ సూర్యకాంత్ రెండు తొడల్లో తూటాలు దూసుకుపోయాయి. వారిద్దరినీ మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో రాయ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు
. ‘‘మాకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ఎన్కౌంటర్లో 50 మంది దాకా నక్సల్స్ పాల్గొన్నారు. ఘటనాస్థలి నుంచి పరారైన వారి కోసం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను బేస్క్యాం్పనకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మృతదేహాల తరలింపు ఆలస్యమవుతోంది’’ అని బస్తర్ రీజియన్ ఐజీ పి.సుందర్రాజ్ విలేకరులకు తెలిపారు.
నక్సల్స్ చరిత్రలోనే ఇది అతి భారీ ప్రాణనష్టంగా తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగినా.. గ్రేహౌండ్స్ ఉనికి ఉండేదని, మంగళవారం నాటి కాల్పుల్లో బీఎ్‌సఎఫ్, డీఆర్జీ మాత్రమే పాల్గొన్నట్లు వివరించాయి.
‘‘2016లో ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అంతకు ముందు గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది నక్సల్స్ మృతిచెందారు’’ అని పేర్కొన్నాయి. ఛత్తీ్‌సగఢ్‌లో 2008లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఇదే అతిపెద్దదని సీఆర్పీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది మావోయిస్టులకు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా ఘటనలు చెబుతున్నాయి. మంగళవారం నాటి ఘటనతో కలిపి.. ఈ మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు. గడిచిన నెల వ్యవధిలోనే నక్సల్స్ తరఫున భారీ ప్రాణనష్టం(54 మంది) నమోదైంది.
దండకారణ్యంలో మావోయిస్టులను గుర్తించేందుకు డీఆర్జీ, బీఎ్‌సఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలకు చెందిన 80 వేల మంది జవాన్లు జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.
భద్రత బలగాలకు అమిత్ షా అభినందన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఛత్తీ్‌సగఢ్‌లో మంగళవారం నక్సలైట్లకు వ్యతిరేకంగా విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించినందుకు భద్రత బలగాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. నక్సలైట్ల సమస్య నుంచి ఛత్తీ్‌సగఢ్‌ను, దేశాన్ని విముక్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.