బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం పీఠికను ఎన్నటికీ మార్చదని, రిజర్వేషన్లు రద్దు చేయదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విస్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ జనంలో ‘భయ వాతావరణాన్ని’ సృష్టిస్తున్నదని, ‘వోటు బ్యాంకు’ రాజకీయాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నదని రాజ్‌నాథ్ ఆరోపించారు.
రాజ్‌నాథ్ సింగ్ ‘పిటిఐ’కి ఇంటర్వూ ఇస్తూ, బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ ‘దుష్ప్రచారం’ చేస్తున్నదని విమర్శించారు. అసలు రాజ్యాంగం పీఠికను మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం పీఠికను మార్చడం జరగదని మంత్రి హామీ ఇవ్వడం బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే భారత్‌ను అభివర్ణించేందుకు ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తుందన్న విమర్శకుల ఆందోళనలను పరిహరించినట్లు అయింది.
బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే రాజ్యాంగాన్ని ‘చించి, పారవేస్తుంది’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించసాగారు. రాజ్యాంగం పీఠిక నుంచి ‘సెక్యులర్’ పదాన్ని బిజెపి తొలగించవచ్చు అని ఇతర కాంగ్రెస్ నేతలు కొందరు భయాందోళనలు వెలిబుచ్చారు.
‘కాంగ్రెస్ 80 సార్లు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చింది. వారు ఎమర్జన్సీ సమయంలో పీఠికను మార్చారు’ అని మంత్రి ఆరోపించారు. ‘బిజెపి రాజ్యాంగాన్ని ఎన్నటికీ మార్చదు. పీఠికలో మార్పులు ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించలేదు. రాజ్యాంగం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బ తీసింది మీరే (కాంగ్రెసే)’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
‘రాజ్యాంగం పీఠికను మార్చే ప్రసక్తే లేదు. వారు దానిని మార్చారు. ఇప్పుడు మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 1976లో చేసిన 42వ సవరణ భారత్ అభివర్ణనను ‘సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్’ నుంచి ‘సర్వసత్తాక లౌకిక (సెక్యులర్) ప్రజాస్వామ్య రిపబ్లిక్’ అని మార్చింది.
పిఒకెపై బలప్రయోగం ఉండదు
కాగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) తమదే అన్న వాదనను భారత్ ఎన్నటికీ విడనాడదని రక్షణ మంత్రి ప్రకటించారు. అయితే, దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఉండదని, ఎందుకంటే కాశ్మీర్లో అభివృద్ధిని చూసిన తరువాత అక్కడి ప్రజలు భారత్‌లో భాగం కావాలని కోరుకుంటారని ఆయన చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎఎఫ్ఎస్పిఎ (సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం) అమలు ఇక ఎంత మాత్రం అవసరం లేని సమయం వస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయితే, ఆ విషయం కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ పరిధిలోనిదని, అది సముచిత చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అక్కడ తప్పకుండా ఎన్నికలు జరుగుతాయని, కాని ఎప్పుడు జరిగేదీ సూచించలేమని ఆయన తెలిపారు.
‘భారత్ ఏమీ చేయవలసిన అవసరం ఉండదని నా భావన. జమ్మూ కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి మారిన తీరు, ఆ ప్రాంతం ఆర్థిక ప్రగతి సాధిస్తున్న తీరు, అక్కడ తిరిగి శాంతి నెలకొన్న విధం బట్టి తాము భారత్‌లో విలీనం అవుతామని పిఒకె ప్రజల నుంచి డిమాండ్లు వస్తాయని భావిస్తున్నా’ అని రాజ్‌నాథ్ చెప్పారు. పిఒకెను స్వాధీనం చేసుకోవలసిన అవసరం తమకు ఉండదని, ‘పిఒకె ఎప్పటికీ మనదే’ అని మంత్రి స్పష్టం చేశారు.