ప్రముఖ భారత సామజిక ఉద్యమకారులు జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయ్ ఫూలేలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ చేసిన వివాదాస్పద వాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫూలే దంపతులు చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని అంటూ `బాల్య వివాహం’గా అభివర్ణిస్తూ ఆయన చేసిన వాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
ఓ కార్యక్రమంలో కోషియారీ మాట్లాడుతూ, పదేళ్ళ వయసున్న సావిత్రి బాయ్‌ని 13 ఏళ్ల వయసులో జ్యోతిబా ఫూలే పెళ్లి చేసుకున్నారని, ఆ చిన్నతనంలో వారు ఏం చేయగలరని, పెళ్లి జరుగుతున్నపుడు వారు ఏం ఆలోచించగలరని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఆయనను తక్షణమే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో బాల్యంలోనే పెళ్లి చేసుకోవడం ఆచారమని, ఇటువంటి అసహ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఫూలేను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
కోషియారీ ఈ మధ్యనే ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై కూడా ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సమర్థ రామదాసు గురువు అని చెప్పారు. ఈ గడ్డపైన అనేక మంది మహారాజులు, చక్రవర్తులు జన్మించారని పేర్కొన్నారు.
చాణక్యుడు లేకపోతే చంద్రగుప్త మౌర్య గురించి ఎవరు అడుగుతారని చెప్పారు. సమర్థ రామదాసు లేకపోతే ఛత్రపతి శివాజీ గురించి ఎవరు అడుగుతారని అంటూ శివాజీ పట్ల చులకనగా మాట్లాడటం పట్ల కూడా తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అయ్యాయి.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్, కోషియారి ప్రశ్నకు బదులిస్తూ, కుల వ్యతిరేక సంస్కర్తలు బాలికల విద్యపై చర్చలు జరపవచ్చని సూచించారు. “సావిత్రీబాయి జ్యోతిబా చదువులో నిమగ్నమై ఉండటం చూసి తనకూ నేర్పించమని కోరింది” అని సావంత్ చెప్పాడు.
“ఆమె దేశంలో మహిళల విద్యకు మార్గం సుగమం చేసింది. ఎనిమిదేళ్ల పాటు సాగిన సంభాషణల ద్వారా, సావిత్రీబాయి 17 ఏళ్ల వయస్సులో బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసింది. సమాజంలోని సంప్రదాయవాద వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ 1848లో సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి బాలికల పాఠశాలను పూణేలోని భిడే వాడాలో ప్రారంభించారు” అని ఆయన గుర్తు చేశారు.
కోషియారీ వ్యాఖ్యలు ఔచిత్యాన్ని ఉల్లంఘించాయని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ విమర్శించారు. మహారాష్ట్రలో గౌరవించే వ్యక్తులను ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం గవర్నర్ ఆపాలని ఆమె హితవు చెప్పారు. బిజెపి ఎంపీ ఉదయన్‌రాజే భోసలే సహితం గవర్నర్ వాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరాఠా రాజు తల్లి జీజాబాయి స్ఫూర్తి కలిగించిందని, రాందాస్ కాదని తెలిపారు.
రెండేళ్ల క్రితం, శాసనసభలో మెజారిటీ లేకపోయినా బిజెపి ప్రభుత్వం ఏర్పర్చడం కోసం అర్ధరాత్రి రాష్ట్రపతికి రాష్ట్రపతి పాలన రద్దుచేయమని ప్రతిపాదనలు పంపి, వెంటనే ఆమోదం పొంది, తెల్లవారే లోగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ను ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా గవర్నర్ తీవ్ర విమర్శలు గురయ్యారు.
ఆ ప్రభుత్వం రెండు, మూడు రోజులకు మించి నిలబడలేక పోయింది.
మరోవంక, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పంపుతున్న పలు ప్రతిపాదనలకు సత్వరం ఆమోదం పంపకుండా జాప్యం చేస్తూ బిజెపి నేతవలే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గవర్నర్ నామినేషన్ కొత్త నుండి 12 మంది ఎమ్యెల్సీల నీయమకంకు సంబంధించి సుదీర్ఘకాలం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పెండింగ్ లో ఉంచారు.