ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజున ఎన్నికల్లో ఉపయోగించిన ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలలో (ఇవిఎంలు) అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. దానితో, ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూము వెలుపల సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు పహరాను ముమ్మరం చేశారు.
ఇవిఎంలను రవాణా చేసే ప్రక్రియలో ప్రొటోకాల్‌ను పాటించలేదని ఒక అధికారి ఒప్పుకున్న వీడియోను ఆ పార్టీ తన ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసింది. ఇవిఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేకపోలేదని కూడా ఆ అధికారి ఆ వీడియోలో అంగీకరించారు.
అనేక జిల్లాలలో ఇవిఎంలలో అక్రమాలు చేసుకున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇవి ఎవరి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని సమాజ్‌వాది పార్టీ తన ట్వీట్లో ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులపై ఒత్తిడి వస్తోందా? దీనికి ఇసి దయచేసి వివరణ ఇవ్వాలి అంటూ ఆ పార్టీ నిలదీసింది.
అయితే ఇదంతా ఓటమిని ముందే గ్రహించి, అందుకు సాకు వెతుక్కోవడమే అని బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అన్న ప్రశ్నే లేదని ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. 2004 నుంచి వీవీప్యాట్లను ప్రతీ పోలింగ్ బూత్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
కాగా, మంగళవారం ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇవిఎంలోని ఓట్లను చోరీ చేసేందుకు అధికార బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇవిఎంలను తీసుకువెళుతున్న ఒక వాహనాన్ని వారణాసిలో అధికార బిజెపి నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
ఇలా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారాణాసి ఏడీఎంపై చర్యలకు ఆదేశించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)ని ఆదేశించింది. ఈవీఎంల రవాణాలో నిబంధనలు ఉల్లంఘించిన వారణాసి ఏడీఎం ఎన్కే సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొనట్టు ఆ వర్గాలు తెలిపాయి.
అఖిలేశ్ యాదవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) ఈవీఎంలను తరలించారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. ఈవీఎంలను తరలించేది ఇలానా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మన ఓట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని, అంతకంటే ముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. ఈవీఎంలను ఓ ట్రక్కులో తరలిస్తున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, వారణాసి కమిషనర్ మీడియాతో మాట్లాడిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆయన మాట్లాడుతూ ఈవీఎంల తరలింపులో లోపం ఉందని అంగీకరించారు. దీంతో అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పుడు ఎన్నికల సంఘం వారణాసి ఏడీఎంపై చర్యలకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.