ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన యుపితో సహా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి గెలుపొందింది. పంజాబ్ లో 117 సీట్లకు గాని 92 సీట్లు గెలుపొంది ఆప్ సంచలనం సృష్టించింది. అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పంజాబ్, ఉత్తర ప్రదేశ్లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
యుపిలో బిజెపిని ఢ కొట్టిన సమాజ్వాది పార్టీ 124 స్థానాలు సాధించింది. ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యుపిలో బిజెపి కూటమి 274 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్-2, బిఎస్పీ ఒక స్థానం సాధించాయి. పంజాబ్లో ఆప్ ప్రభంజనానికి కాంగ్రెస్, అకాలీదళ్ ఎదురు నిలవలేకపోయాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ తాను పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, మరో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా దేశ రాజకీయాల్లోనే ఆప్ సంచలనం సృష్టించింది.
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమి చవిచూశారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 18, అకాలీదళ్ కూటమి 4 స్థానాలతో బాగా వెనుకబడ్డాయి.
70 స్థానాలున్న ఉత్తరాఖండ్లో బిజెపి 46 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్-18 సీట్లకే పరిమితమైంది. ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో గెలుపొందడం ఇదే ప్రధమం. అయితే ముఖ్యమంత్రి ఓటమి చెందారు.
40 స్థానాలున్న గోవాలో బిజెపికి 20 స్థానాలు రాగా, కాంగ్రెస్ 11 స్థానాలతో వెనకబడింది. ముగ్గురు స్వతంత్రులతో పాటు మరొకొందరు మద్దతు తెలపడంతో బిజెపి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమైనది. 60 స్థానాలున్న మణిపూర్లో 32 స్థానాలతో బిజెపి రెండోసారి అధికారం చేజిక్కించుకోగా, కాంగ్రెస్ కేవలం 4 సీట్లతో సరిపెట్టుకుంది. మొత్తం మీద ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్నే చూపే అవకాశముంది.