దేశంలోనే పేపర్ రహిత తొలి అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. శాసన సభా కార్యకలాపాల్లో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (ఎన్ఇవిఎ) కార్యక్రమాన్ని అమలు చేసిన అసెంబ్లీగా నాగాలాండ్ చరిత్ర సృష్టించింది.
దీంతో సభా కార్యకలాపాల్లో పేపర్‌ను వినియోగించలేరు. 2022-23 ఆర్థిక సెషన్ బడ్జెట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విధానంలో… 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి టేబుల్‌పై ఈ-బుక్ లేదా ట్యాబ్లెట్‌ను అమర్చారు.
‘కాగిత రహిత సభను ఏర్పాటు చేయడంలో భాగంగా మేము అసెంబ్లీలో ఎన్ఇవిఎ అప్లికేషన్ మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చాం’ అని స్పీకర్ షేరింగైన్ లాంగ్‌కుమార్ తెలిపారు. ఇదే వ్యవస్థ హిమాచల్ ప్రదేశ్‌లో అమలులో ఉందని, ఇతర రాష్ట్ర అసెంబ్లీలు సైతం ఈ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ విధానం ద్వారా శాసనసభలోని ఒక్కో సభ్యుడికి ఒక్కో స్మార్ట్ టాబ్లెట్ ను వారి వారి సీట్ల వద్ద అమర్చుతారు. టాబ్లెట్ లో ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ లో సభ్యుని వివరాలు, పాటించాల్సిన నియమాలు, వ్యాపార జాబితా, నోటీసులు, బులెటిన్లు, బిల్లులు, మార్క్ చేసిన ప్రశ్నలు, సమాధానాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచుతారు.
ఆ అప్లికేషన్ ను డేటాబేస్ కు అనుసంధానిస్తారు. సభ్యులు అప్లికేషన్ ను సమర్ధవంతంగా నిర్వహించేవిధంగా ముందుగా శాఖలవారీగా వారికి శిక్షణ ఇస్తారు. సాఫ్ట్‌వేర్‌లో ఈ -పత్రాలను ఇంగ్లీష్ , ఏదైనా ప్రాంతీయ భాషలో తర్జుమా చేసుకునే వీలుంటుంది. ఇదంతా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పర్యవేక్షణలో జరుగుతుంది.
దేశంలోనే మొదటి పేపర్ లెస్ అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. చట్టసభల్లో కాగిత రహితంగా కార్యకలాపాలు నిర్వహించాలనే లక్ష్యంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.