కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గత సంవత్సరకాలంగా లెక్కచేయకుండా వస్తున్న జి23 నేతలను అకస్మాత్తుగా శాంతింపజేసేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.
పార్టీ అగ్ర నాయకత్వం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ముఖ్యంగా పార్టీని ‘ఒక్క కుటుంభం’ ఆస్తిగా మారుస్తున్నారని అంటూ కఠినమైన పదజాలంతో లేఖ వ్రాసి, తరచూ మీడియాలో పార్టీ నాయకత్వం నడవడికను ప్రశ్నిస్తూ వస్తున్నా వారిని పట్టించుకోవడం లేదు.
మొత్తం ఐదు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి ఘోరమైన ఫలితాల తర్వాత, పార్టీకు బలమన పంజాబ్‌ను అవమానకార రీతిలో కోల్పోవడం, ప్రియాంక గాంధీ `ట్రంప్ కార్డ్’ ప్రయోగించినా ఉత్తరప్రదేశ్‌లో ఫలితం చూపక పోవడంతో జి23 నాయకులను దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నాలు ప్రారంభించారని చాలామంది భావిస్తున్నారు.
అదే నిజమైతే, ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే వారు జి23 నేతల పట్ల కొన్ని సానుకూల సంకేతాలు పంపించి ఉండేవారు. కనీసం మార్చి 20న జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో వారి అభిప్రాయాన్ని గౌరవించిఉండేవారు. కానీ అటువంటి ప్రయత్నమే చేయలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో `ఆత్మపరిశీలన’ అనెడిదే వ్యక్తం కాలేదు.
సీడబ్ల్యుసి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత, పార్టీ భవిష్యత్ పట్ల ఆందోళనతో జి23 నేతలు వరుసగా బులాబ్ నబి ఆజాద్ ఇంట్లో సమాలోచనలు జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా పార్టీ భవిష్యత్ పట్ల గాంధీలలో ఆందోళన ప్రారంభమైంనట్లు కనిపిస్తున్నది.
వారి ఆందోళన అంతా జి23 నేతలు పార్టీలో `చీలిక’ అస్త్రం ప్రయోగిస్తే, ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుందని, పార్టీలో ఎవ్వరికీ ఏమేరకు బలం ఉన్నదో చూడకుండా ముందుగా పార్టీ ఎన్నికల గుర్తు, పార్టీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులను స్తంభింప చేస్తే తీవ్రమైన పరాభవం ఎదుర్కోవలసి రావచ్చని సున్నితమైన, ఆందోళనకరమైన సలహాలిచ్చి ఉండవచ్చని తెలుస్తున్నది.
అప్పుడు మాత్రమే, రాహుల్ గాంధీ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను కలిశారు. జి23 నేతలను సముదాయించడానికి ఆయన ‘మధ్యవర్తిత్వం’ కోరినట్లున్నది. గత ఏడాది కాలంగా రాహుల్ జి23 నేతలు ఎవ్వరితో మాట్లాడక పోవడం గమనార్హం. తాజాగా కేవలం హుడాతో మాటలతో మాట్లాడారు.
ఆ వెంటనే, సోనియా గాంధీ స్వయంగా ఆజాద్‌కు ఫోన్ చేయడం, ఆజాద్, మరో కొందరు ఆమెను కలవడం అన్ని వేగంగా జరిగిపోయాయి. వాస్తవానికి కాంగ్రెస్ పరాజయాలకు బాధ్యత వహించకుండా తప్పించుకోవడం కోసం నేరుగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టకుండా, తెరవెనుక నుండే అధ్యక్షుడి అధికారాలు అన్ని చెలాయిస్తున్నారు.
మరోవైపు, మార్చ్ 20న జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యక ఆహ్వానితులే పేరుతో గాంధీ కుటుంభం మద్దతుదారులను పెద్ద సంఖ్యలో హాజరయ్యేటట్లు చేసినా సమావేశంలో రాహుల్ ను గట్టిగా సమర్ధిస్తూ వారెవ్వరూ మాట్లాడలేదు. కేవలం అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే మాత్రమే రాహుల్ ను వెన్కవేసుకు వచ్చారు.
జి23 నాయకులతో సర్దుకుపోవడానికి రాహుల్ కు ఉన్న సమస్య ఏమిటంటే, వారంతా ప్రజాక్షేత్రంలో మద్దతు లేని కుర్చీలకు పరిమితమైన నాయకులుగా వారిని ఈసడించుకొంటూ వచ్చారు. అయితే, హర్యానాలో సోనిపట్-రోహ్తక్లో గణనీయమైన ప్రభావాన్ని చూపగల, రాష్ట్రంలో కాంగ్రెస్ కు గల ఏకైక జాట్ నేత అయినా హుడా లేకపోతే పార్టీ మనుగడ కష్టం కాగలదు. అందుకనే ఆయనతో సర్దుబాటు తప్పలేదు.