రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అండతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడమే కాకుండా, బలమైన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ను ప్రదవీచ్యుతుడిని కావించి, తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నా రాజకీయ నేతగా మారిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ లో చుక్కెదురైంది.
అమరిందర్ సింగ్ రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి పదవి తాను సూచించిన వారికి కాకుండా మరొకరికి ఇవ్వడం, కనీసం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించాక పోవడం, ఘోరంగా కాంగ్రెస్ ఓటమి చెందడంతో పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయమనడంతో ఇప్పటికే రగిలిపోతున్న సిద్ధుకు తాజాగా కీలక నీయమకాలు ఆయనకు సంబంధం లేకుండా జరగడంతో తీవ్ర ఆశాభంగంకు గురైనట్లు కనిపిస్తున్నది.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేషనల్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించడం సిద్ధూ శిబిరంలో నిరసన జ్వాలలలు రేకెత్తిస్తున్నాయి. సిద్ధూ కొత్త కాంగ్రెస్ చీఫ్.. కొత్త సిఎల్పి నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా, డిప్యూటీ సిఎల్పి నాయకుడు రాజ్‌కుమార్ చబ్బెవాల్‌లను అభినందించగా, అతని మద్దతుదారులు శనివారం రాత్రి ప్రకటించిన నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించారు.
“రాజా వారింగ్‌కి అభినందనలు. భరత్ భూషణ్ ఆశు వారికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా” అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు. అమర్గఢ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సిద్ధూ మద్దతుదారు సుర్జిత్ సింగ్ ధీమాన్ కొత్త నియామకాలపై స్పందిస్తూ.. కొత్త పీసీసీ చీఫ్ అనుభవం లేని వ్యక్తి అని, ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమించడం పార్టీకి ఎదురుదెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ అత్యంత అవినీతిపరుడని, ఆయనను నియమించాలనే నిర్ణయం తప్పని తెలిపారు. ఈ నిర్ణయం పంజాబ్‌లో పార్టీని దెబ్బతీస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఈ షాక్ నుండి ఎక్కువ కాలం బయటపడదని ధీమాన్ హెచ్చరించారు. కొత్త పిసిసి చీఫ్‌కు అవసరమైన మద్దతు లేదు కాబట్టి నాయకుడిగా అంగీకరించలేం అని ఆయన స్పష్టం చేశారు.
సుర్జిత్ ధీమాన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ప్రశంసలు కురిపించారు. సిద్ధూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశారని, పిసిసి చీఫ్‌గా తొలగించిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. మరోవైపు, `రాజా వారింగ్ బాదల్స్ కాళ్లపై పడి వారితో రాజీ పడ్డాడు’ అని ధీమాన్ చెప్పాడు. ఇదిలావుండగా మాజీ ఎమ్మెల్యే బటాల అశ్విని శేఖరి, మాజీ జండియాలా ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ డానీ సహా ఆయన శిబిరానికి చెందిన పలువురు నేతలు ఆదివారం అమృత్సర్ నివాసంలో నవజ్యోత్ సిద్ధూను కలిశారు.