కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి రాజకీయ కలకలం రేపుతోంది.ఈ కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు బుధవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో మొదటి నిందితుడిగా ఆయన పేరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాటిల్ ను మంత్రి, ఆయన అనుచారులు లంచం అడగాడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని థాని సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఆరోపించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంత్రి ఈశ్వరప్ప, ఆయన ఇద్దరు అనుచరులపై కేసు నమోదు చేసుకొని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
హిండలగ గ్రామంలో రూ.4 కోట్లు విలువచేసే పనులను తన సోదరుడు చేశాడని, ఆ పనులకు సొంత డబ్బులు ఖర్చు చేయగా, బిల్లులు పెండింగ్‌లో ఉంచారని ఆయన తెలిపారు. సొమ్ములు విడుదల చేయాలని ఈశ్వరప్పను పలుమార్లు సంతోష్ కలిసి విజ్ఞప్తి చేశారని, అయితే ఆయన సహచరులైన బసవరాజ్, రమేష్‌లు 40 శాతం కమిషన్ అడిగారని ఆరోపించారు.
రాజీనామా ప్రసక్తి లేదు
అయితే, ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఈ విషయమై ప్రతిపక్షాలు కోరినట్లు తాను పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. పైగా, సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను తను ఇప్పటి వరకు కలవలేదని, కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని తెలిపారు.
“నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్‌కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు అని వివరించారు.
తనపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరినట్టు ఈశ్వరప్ప చెప్పారు. మరోవంక, కంట్రాక్లర్ సంతోష్ పాటిల్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ప్రకటించారు. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
కాగా, పాటిల్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని సాక్షాలను పరిశీలిస్తోంది. పాటిల్ అనుమానాస్పద మృతి సంచలనం కావడంతో ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు చేశారు.
ఈశ్వరప్పను గవర్నర్ తొలగించాలని, అతన్ని అరెస్టు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారంనాడు డిమాండ్ చేశారు. తన సొంత మనుషులతో 40 శాతం కమిషన్‌కు డిమాండ్ చేసిన మంత్రిపై అవినీతి కేసు నమోదు చేయాలని కోరారు.