వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. అవినీతి ఆరోపణలపై ఒక సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కె ఎస్ ఈశ్వరప్ప మంత్రివర్గం నుండి రాజీనామా చేయవలసి రాగా, అంతటితో ఆరోపణలు ఆగడం లేదు.
దానితో దిక్కుతోచక, గతంలో గుజరాత్ లో చేసిన్నట్లు మొత్తం ప్రభుత్వం, పార్టీ వ్యవస్థను మార్చాలనే ఆలోచనలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాలకు పైబడిన వయస్సు పేరుతో పక్కకు తప్పించిన మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్డ్యూరప్ప జోక్యం ఇప్పుడు అవసరమని పలువురు భావిస్తున్నారు.
బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ద్వారా కర్ణాటక రాజకీయాలలో ప్రవేశించడం కోసం చూస్తున్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 21న బెంగళూరులో రైతుల కోసం జరిపిన రాజకీయ ర్యాలీలో ప్రధానంగా కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల అవినీతిని ప్రస్తావించారు. “దీనికి ముందు (కాంగ్రెస్) ప్రభుత్వం 20 శాతం (కమీషన్) ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం (బిజెపి) 40 శాతం ప్రభుత్వం. ఢిల్లీలో, మాకు జీరో శాతం ప్రభుత్వం ఉంది, ”అని చెప్పారు.
‘‘కర్ణాటక ఎన్నికల్లో అవినీతికి పెద్దపీట వేస్తుందన్న ఆందోళన పార్టీలో ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై స్పష్టత లేదు – అవినీతిని పరిష్కరించడానికి సుముఖత చూపడానికి తీవ్రమైన చర్యలు అవసరమా లేదా యథాతథ స్థితి కొనసాగుతుందా, ” అనే సంకటంలో బిజెపి నాయకత్వం ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
గత సెప్టెంబర్లో, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 14 నెలల ముందు, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, అతని క్యాబినెట్ మొత్తాన్ని మార్చి మొదటిసారి ఎమ్మెల్యే భూపేందర్ పటేల్ నేతృత్వంలోని బృందంతో భర్తీ చేశారు. ఆ విధంగా కర్ణాటకలో కూడా చేయాలనే ఆలోచనలు ఒక వర్గంలో కనిపిస్తున్నాయి.
బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాన అవినీతి ఆరోపణల్లో ఒకటి కర్ణాటక సివిల్ కాంట్రాక్టర్ల సంఘం నుండి వచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడిన ప్రాజెక్టుల కాంట్రాక్టులను క్లియర్ చేయడానికి ప్రభుత్వ అధికారులు 40 శాతం కమీషన్ను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్ తన ఆరోపణను ఆధారాలతో రుజువు చేయలేదు.
అయితే, ఏప్రిల్ 12 న ఉడిపిలోని ఒక లాడ్జిలో శవమై కనిపించిన సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ప్రభుత్వ అధికారులపై ఇదే విధమైన ఆరోపణ చేస్తూ ఒక నోట్ వదలడం ప్రభుత్వంలో కలకలం రేపింది. అధికారులు 40 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, రూ 4 కోట్ల బిల్లు క్లియర్ చేయడానికి కమీషన్ అడగడం ద్వారా తన మరణానికి బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కారణమని పాటిల్ ఆరోపించారు. దానితో ఈశ్వరప్ప ఏప్రిల్ 15న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఏప్రిల్ 18న, ఆధిపత్య లింగాయత్ కమ్యూనిటీ మతపరమైన కేంద్రమైన బాలెహోసూర్ మఠానికి చెందిన దింగాళేశ్వర స్వామి, అతిథి గృహం నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ నిధులను పొందడానికి అధికారులకు 30 శాతం కమీషన్ ఇవ్వాలని మఠాన్ని అడిగారని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ బలమైన వ్యక్తి యడియూరప్పకు సన్నిహితుడిగా పరిగణించబడే దింగాళేశ్వర స్వామి, కొందరు కాంగ్రెస్ నేతల ప్రమేయంతో ఈ ఆరోపణలు చేశారని బొమ్మై ప్రభుత్వంలోని కొంతమంది లింగాయత్ మంత్రులు ఎదురు దాడి చేశారు.
ఈ గత వారం, అక్టోబర్ 2021లో నిర్వహించిన పరీక్ష ద్వారా 545 పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను కూడా ప్రభుత్వం ఎదుర్కొంది. ఆరోపించిన కుంభకోణంలో పాల్గొన్న కీలక వ్యక్తులలో ఒకరిని బిజెపి మాజీ కార్యకర్త ఒకరుగా గుర్తించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీకి అందించిన డేటా ప్రకారం, గత ఐదేళ్లలో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నమోదు చేసి దర్యాప్తు చేసిన 310 అవినీతి కేసుల్లో 72 శాతం ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వలేదు.
బీజేపీ రాష్ట్ర శాఖకు అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదు. ఇలాంటి ఆరోపణలు మాజీ సీఎం యడియూరప్పతో పాటు ఆయన కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నాయి. 2019లో, కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) నుండి 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
“అవినీతి సమస్య కర్ణాటకలోని పార్టీ, దాని మద్దతు సంస్థలలో లోతుగా పాతుకుపోయింది. వివిధ కారణాల ద్వారా పలువురు మౌనంగా ఉంటున్నారు. అవినీతి సమస్యను పరిష్కరించకపోతే మతపరమైన కథనం ఫలితాలను ఇవ్వదు” అని బిజెపి కార్యకర్త ఒకరు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో సన్నిహిత సంబంధాలున్న ప్రభుత్వ అధికారులు, బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం, కర్నాటక బిజెపి రాష్ట్రంలోని అతిపెద్ద కులాల సమూహం (జనాభాలో 17 శాతం) అయిన లింగాయత్ కమ్యూనిటీ మద్దతుపై ఆధారపడే సంప్రదాయ మార్గాన్ని అనుసరించేందుకు మొగ్గు చూపుతోంది. లింగాయత్ మద్దతు చెక్కుచెదరకుండా ఉండటానికి, యడ్యూరప్పను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం కోసం ఏప్రిల్ 17న రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకను ప్రధాని నరేంద్ర మోదీ, బొమ్మై, యడియూరప్ప అభివృద్ధిలో స్వర్ణయుగంలోకి నడిపిస్తున్నారని కొనియాడారు. కొన్ని రోజుల తర్వాత, యడ్యూరప్ప సొంత జిల్లా శివమొగ్గలోని కొత్త విమానాశ్రయానికి 79 ఏళ్ల మాజీ సీఎం పేరు పెట్టనున్నట్లు బొమ్మై ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ బృందంలో యడ్యూరప్ప కూడా ఉన్నారు. 2008లో 224 మంది సభ్యులున్న సభలో 113 మెజారిటీ మార్కుకు మూడు సీట్లు తగ్గినప్పుడు, 2018లో దాని సంఖ్య 104కి చేరుకున్నప్పటికీ, కర్ణాటకలో బీజేపీ ఇంకా స్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయింది. రెండు సందర్భాల్లోనూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయించడం ద్వారా పార్టీ అధికారాన్ని పొందింది.
ఈసారి 150 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో- హిజాబ్ నిషేధం, దేవాలయాల జాతరలలో ముస్లిం వ్యాపారులపై ఆంక్షలు , హలాల్ ఉత్పత్తులను బహిష్కరించమని పిలుపులు వంటి మతపరమైన వివాదాల సమయంలో కాంగ్రెస్ “మైనారిటీ బుజ్జగింపు”ను లక్ష్యంగా చేసుకొని బిజెపి దాడులు చేసింది.
‘‘ఈ దేశానికి కాంగ్రెస్ అందించినవి రెండు. ఒకటి, అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. భింద్రన్వాలేను ఎవరు సృష్టించారు? దావూద్ ఇబ్రహీం దుబాయ్ పారిపోవడానికి ఎవరు అనుమతించారు? అదే మనస్తత్వంతో వారు అల్లర్లను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అరాచకం సృష్టిస్తున్నారు, ”అని గత వారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్ కటీల్ పేర్కొన్నారు. భారత దేశంలో అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అని కూడా ఆరోపించారు.