తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏ మాత్రం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా కానీ, ప్రధాన మంత్రిగా కానీ అణగారిన వర్గాలవారి సంక్షేమం కోసం కృషి చేస్తానని, కానీ రాష్ట్రపతి కాబోనని ఆమె స్పష్టం చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బీఎస్పీ ఓట్లను బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా మాయావతి రాష్ట్రపతి అవుతారేమో అంటూ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
తనను రాష్ట్రపతిని చేయాలని సమాజ్‌వాదీ పార్టీ కలలు కంటోందని, అందుకు కారణం ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అవడానికి మార్గం సుగమమవుతుందని భావించడమేనని ఆమె ఎద్దేవా చేశారు. అయితే, ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి కానీ, తనను రాష్ట్రపతిని చేయడం గురించి కానీ కలలు కనడం మానేయాలని ఆమె అఖిలేష్ కు హితవు పలికారు.
అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే తాను నడవాలనుకుంటున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కలలు, ఆదర్శాలను అమలు చేయడానికి తాను చిత్తశుద్ధితో కృషి చేయడానికి కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. బలహీన వర్గాలవారిని సాధికారులను చేయడానికి, అభివృద్ధి చేయడానికి తాను పోరాడుతున్నానని ఆమె చెప్పారు.
దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తాను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదని బెహన్ జీ వెల్లడించారు. ముస్లింలు, ఓబీసీలను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని అఖిలేశ్ యాదవ్ తెలుసుకున్నారని ఆమె స్పష్టం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో మారెప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మాయావతి తేల్చి చెప్పారు. అఖిలేష్ దేశం విడిచి, విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
దళితులు, ముస్లింలు, ఓబీసీలు తలచుకొంటే తనను ముఖ్యమంత్రిని లేదా ప్రధాన మంత్రిని చేయగలర ఆమె భరోసా వ్యక్తం చేశారు. వారిని ప్రత్యర్థి పార్టీలు తేలికగా తీసుకోకూడదని ఆమె హెచ్చరించారు. వారి శ్రేయోభిలాషి బీఎస్పీ అనే సంగతిని తెలుసుకోవాలని ఆమె చెప్పారు.
కాగా, వచ్చే ఎన్నికల అనంతరం బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఏకమవాలని మాయావతి పిలుపునిచ్చారు. ముస్లింలు రంజాన్ జరుపుకుంటున్న సమయంలో విద్యుత్తు కోతలు విధించడాన్ని ఆమె తప్పుబట్టారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా అయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
మాయావతి గత నెలలో మాట్లాడినపుడు తమ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కారణాలను వివరిస్తూ, ముస్లిం ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి గంపగుత్తుగా వెళ్ళాయని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఆమె పార్టీకి 13 శాతం ఓట్లు వచ్చాయి.
మాయావతి సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.