ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకుని విషయమై మల్లగుల్లాలు పడి, చివరకు ఆయన పార్టీలో చేరానని చెప్పడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకొంటున్న కాంగ్రెస్ అధిష్ఠానంకు రాజస్తాన్ రూపంలో మరో తలనొప్పి ఎదురవుతున్నది.
ఏ మాత్రం ఆలస్యం కాకుండా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పార్టీ నాయకత్వంకు అల్టిమేటం ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఈ మధ్య వరుసగా భేటీలు జరుపుతున్న ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారని చెబుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉన్నందున పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనుకుంటే.. చకాచకా పనులు జరగాలని సచిన్ స్పష్టం చేస్తున్నారు. అలా కాకుండా ఆలస్యం చేసి, పంజాబ్ లో వలే ఎన్నికల ముందు ముఖ్యమంత్రిని మార్చినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అటువంటప్పుడు, పంజాబ్ గతే రాజస్తాన్‌కు పట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు.
కాగా, 2023 డిసెంబర్లో రాజస్తాన్ ఎన్నికలు జరగనుండగా, నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పార్టీకి కోలుకోలేని నష్టం తీసుకు రాగలదని స్పష్టం చేస్తున్నారు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేయడంతో,ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 100 మందికి పైగా ఎమ్మెల్యేలను రిస్టార్ట్స్‌లో ఉంచాల్సి వచ్చింది.
చివరకు బిజెపితో చేతులు కలిపినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే బలం సమకూర్చుకోలేక పోవడంతో వెనుకడుగు వేయలేక తప్పలేదు. తన మద్దతుదారులకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తానని హామీనివ్వడంతో సచిన్ వెనక్కు తగ్గారు. అయితే ఆ హామీ మేరకు ఈ మధ్యనే ఆయన మద్దతు దారులు కొద్దిమందిని మంత్రివర్గంలో చేర్చుకున్నా,సచిన్ కు మాత్రం పార్టీలో ఎటువంటి ప్రాధాన్యతగల హోదా లభించనే లేదు.
మరోవంక, సచిన్ సోనియా గాంధీ, ఇతర నేతలను కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రిని మార్చబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అశోక్ గెహ్లాట్ ఈ మధ్య అసహనం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడో రాజీనామా లేఖను సోనియాకు అందజేశానని, ఆమె ఎప్పుడంటే అప్పుడే తనను దించివేయవచ్చని అంటూ పరోక్షంగా పార్టీ అధిష్ఠానంపై చురకలు వేశారు.
సోనియా, రాహుల్ లకు మద్దతు ఇస్తున్న అతికొద్దిమంది సీనియర్ నేతలలో అశోక్ గెహ్లాట్ ఒకరు కావడంతో 2024 ఎన్నికల ముందు ఆయనను గద్దె దించేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. పైగా, రాజస్థాన్ లో పార్టీపై, ప్రభుత్వంపై ఆయన గట్టి పట్టు ఏర్పరచుకున్నారు.