ఆధునిక భారత్లో అత్యంత ప్రజాధారణ పొందిన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ‘మోదీ@20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సమక్షంలో విడుదల చేశారు.
ఒక దిగ్గజ నాయకుడి 20 సంవత్సరాల ప్రయాణాన్ని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. కలలను సాకారం చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు.
మోదీ దేశ ప్రజల కోసం ఎలా పెద్ద కలలు కంటున్నారు.. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాలను ఈ పుస్తకంలో చక్కగా వివరించారని వెంకయ్య నాయుడు అభినందించారు.
మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈ పుస్తకంలో మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని తెలియజేస్తుందని చెప్పారు.
ఆటోల్లో, బస్సుల్లో ప్రతి గ్రామానికి తిరిగి.. పేద వారితో కలిసి భోజనం చేసిన అనుభవశాలి మోదీ అని కొనియాడారు. మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి కనీసం గ్రామాన్ని పాలించిన అనుభవం కూడా లేదని ఆయన గుర్తు చేసారు. కానీ, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో గెలిచి గుజరాత్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించారని అమిత్ షా వివరించారు.
ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసింది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత దేశ ప్రధాన మంత్రిగా 20 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్న పరిపాలన విధానాన్ని ఈ పుస్తకంలో వివరించారు.
అమిత్ షా, అజిత్ దోవల్, సుధా మూర్తి, నందన్ నీలేకని, అరవింద్ పనగారియా, సుబ్రహ్మణ్యం జైశంకర్, లతా మంగేష్కర్, పీవీ సింధు, నృపేంద్ర మిశ్రా వంటివారు రాసిన వ్యాసాలను దీనిలో పొందుపరిచారు.