నవంబర్ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దీంతో భారత్లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఓటీటీ నిర్వహించనున్న ఘనతను సొంతం చేసుకుంటుంది. ‘సీ స్పేస్’ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, జాతీయంగా, అంతర్జాతీయంగా అవార్డులు గెలిచిన సినిమాలు, షార్ట్ఫిల్మ్లు ఉంటాయని, ప్రస్తుతమున్న ఓటీటీలకు భిన్నంగా ఈ ఓటీటీలో కొన్ని ఫీచర్లను పొందుపరచనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి సాజీ చెరియన్ వెల్లడించారు.
ఈ ఓటీటీని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కెఎస్ఎఫ్డిసి) చొరవతో ప్రభుత్వం నిర్వహించనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఓటీటీని ప్రారంభించడం ఓ కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని, అలాగే మలయాళ సినిమా అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
కొత్త ఓటీటీ ద్వారా సినిమా వ్యాపారానికి ఎలాంటి సంక్షోభం తలెత్తదని ఆయన భరోసా ఇచ్చారు. సినిమాలను థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే.. ‘సీ స్పేస్’లో ప్రసారం చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ‘సీ స్పేస్’ లాభాల భాగస్వామ్యంతోపాటు, అత్యాధునిక సాంకేతిక నాణ్యతను నిర్ధారిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే ‘సీ స్పేస్’లో ప్రసారం చేయబోయే సినిమాల రిజిస్ట్రేషన్ జూన్ 1న ప్రారంభం కానుందని, దీనికోసం చిత్రాంజలి స్టూడియోతోపాటు, రాష్ట్ర రాజధానిలోని కెఎస్ఎఫ్డిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఓటీటీని ప్రారంభించడంపై ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కరణ్ మాట్లాడుతూ ‘సీ స్పేస్… నిర్మాతలకు, వారి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ వంటి దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందేలా చేస్తుంది. కేరళ ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించి… ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన కొనియాడారు.
ఈ ఓటీటీలో ఒక నిర్దిష్టమైన సినిమాను వీక్షించాలనుకునే వారు డబ్బు చెల్లించి ఆ సినిమాను వీక్షించవచ్చు. అయితే ప్రేక్షకులు ఇచ్చిన మొత్తంలో ఒక భాగం నిర్మాతకు వెళుతుంది అని కెఎస్ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మాయ చెప్పారు.
