ఈ నెల 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికవుతుండగా, కేవలం కర్ణాటక, రాజస్థాన్ లలో మాత్రమే పోటీ ఏర్పడింది. తమ బలానికి మించి కాంగ్రెస్, బీజేపీ ఒకొక్క అభ్యర్థిని అదనంగా పోటీకి దింపడంతో ఈ రాష్ట్రాలలో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉండగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాగా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో సహితం పోటీ నెలకొంది.
దానితో తమ, తమ అభ్యర్థులు ఎన్నికయ్యేటట్లు చూడడం కోసం ఈ రెండు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీల నేతలు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సినీ నటుడు జగ్గేశ్, పారిశ్రామికవేత్త లెహర్‌సింగ్ బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, మన్సూర్ ఆలీఖాన్ బరిలో ఉన్నారు.
జేడీఎస్ నుంచి మాజీ ఎంపీ కుపేంద్రరెడ్డి నామినేషన్ సమర్పించారు. శాసనసభలో అధికార బీజేపీకి 122 మంది సభ్యులు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రె్‌సకు 71 మంది, జేడీఎ్‌సకు 32 మంది సభ్యులు ఉన్నారు. గెలుపొందేందుకు ఒక్కో అభ్యర్థికి 45 ఓట్ల అవసరం కాగా బీజేపీ వద్ద 32 అదనపు ఓట్లు ఉన్నాయి. తమ మూడో అభ్యర్థి గెలవాలంటే బీజేపీకి ఇంకా 13కు పైగా ఓట్లు అవసరం.
ఇక కాంగ్రెస్ వద్ద 26 అదనపు ఓట్లు ఉండగా తమ రెండో అభ్యర్థిని గెలిపించుకునేందుకు వారికి 19 ఓట్లు కావాలి. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఎన్నికల పర్యవేక్షకునిగా నియమించింది. ఆత్మసాక్షి ఓటు నినాదాన్ని తెరపైకి తెచ్చింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన ముగ్గురు అభ్యర్థులు గెలవడం ఖాయమని మాజీ సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇక, తమ అభ్యర్థి కుపేంద్రరెడ్డిని గెలిపించుకునేందుకు దళపతి, మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాతో ఫోన్లో చర్చలు జరిపిన ఆయన మద్దతు కోరారు.
మరోవంక, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో క్యాంపు రాజకీయానికి తెరలేచింది. అధికార కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌కు తరలిస్తుంది. రాష్ట్రంలో 4 స్థానాలు ఉండగా మీడియా ప్రముఖుడు సుభా్‌షచంద్ర కాంగ్రె్‌సకు పోటీగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీజేపీ మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
తమ ఎమ్మెల్యేలను ఎగరేసుకు కాకుండా క్యాంపు ఏర్పాటు చేసింది. సొంత నేతలు, తమకు మద్దతు పలుకుతు న్న ఇతర పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేలనూ ఉదయ్‌పూర్‌కు తరలిస్తోంది. గురువారం లోపు అక్కడికి చేరుకోవాలని ఎమ్మెల్యేలందరికీ ఆదేశాలు పంపింది. ఇప్పటికే పలువురు ఆ హోటల్‌కు చేరుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
రాజస్తాన్ నుండి ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు గానూ.. కాంగ్రెస్.. ముకుల్ వాస్నిక్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీలను బరిలోకి దింపుతోంది. కాగా, బిజెపి మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీని నామినేట్ చేసింది. బిజెపి మద్దతున్న జి టివి అధిపతి సుభాస్ చంద్ర ప్రస్తుతం హర్యానా నుండి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం ఆగస్టు 1తో ముగియనుంది.