కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిన బంగారు స్మగ్లింగ్ కేసులో స్వయంగా ముఖ్యమంత్రి పునరాయి విజయన్ కు సంబంధం ఉన్నట్లు ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేష్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం రాజకీయ కలకలం రేపుతున్నది. పైగా, కోర్టులో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటమే కాకుండా, ఆ విధంగా ఆరోపణలు చేయడంలో తనకు ఎటువంటి వ్యక్తిగత లేదా రాజకీయ ఎజెండా లేదని కూడా ఆమె స్పష్టం చేశారు.
స్వప్న సురేశ్ మంగళవారం కొచ్చిలోని కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చారు. బంగారం అక్రమ రవాణా కేసు నేపథ్యంలో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఆమె ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన సతీమణి కమల, కుమార్తె వీణలపై ఆరోపణలు చేశారు.
విజయన్ ఓ బ్యాగు నిండా కరెన్సీ నోట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తీసుకెళ్ళారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను సీఎం విజయన్ తోసిపుచ్చారు. తనకు వ్యతిరేకంగా రచించిన ఎజెండాలో భాగమే ఈ ఆరోపణలని ఆయన విమర్శించారు.
తిరిగి, స్వప్న సురేశ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను కోర్టుకు స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఎటువంటి రాజకీయ ఎజెండా కానీ, వ్యక్తిగత ఎజెండా కానీ లేదని వివరణ ఇచ్చారు. పైగా, సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లోని అంశాలను గతంలోనే దర్యాప్తు సంస్థలకు చెప్పానని ఆమె వెల్లడించారు.
తనకు ముప్పు ఉందని, తన ప్రస్తుత ఎంప్లాయర్ కూడా దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమె ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
పినరయి విజయన్ సతీమణి కమల, కుమార్తె వీణలపై ఈ కేసులో ఆమె చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, కమల, వీణ విలాసవంతంగా గడుపుతున్నారని ఆమె ఆరోపించారు. తనను మాత్రమే తన బాధలను తాను అనుభవించే విధంగా వదిలేశారని ఆమె మండిపడ్డాయిరు. కాగా, తన స్టేట్మెంట్లను ఎవరూ తమ వ్యక్తిగత ఎజెండాల కోసం వాడుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
స్వప్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తాను కమల, వీణ, విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్, ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నళిని నెట్టో, మాజీ మంత్రి కేటీ జలీల్‌లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానని పేర్కొన్నారు. వీరికి బంగారం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నట్లు చెప్పానని తెలిపారు. ఇంత కన్నా ఎక్కువ వివరాలను తాను ఇప్పుడు బయట పెట్టలేనని ఆమె చెప్పారు.
యూఏఈకి కరెన్సీని తీసుకెళ్ళడంలో పినరయి విజయన్ ప్రమేయం ఉందని చెప్తూ, శివశంకర్ తనను మొదటిసారి 2016లో కలిశారని ఆమె తెహెలిపారు. అప్పట్లో తాను కాన్సుల్ జనరల్‌కు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పని చేసినట్లు చెప్పారు.
యుఎఇ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఓ బ్యాగును తీసుకెళ్ళడం మర్చిపోయారని తనకు శివశంకర్ చెప్పారని ఆమె తెలిపారు. ఆ బ్యాగును దుబాయ్ తీసుకెళ్ళవలసి ఉన్నదంటూ, ఆ బ్యాగును తిరువనంతపురంలోని కాన్సులేట్‌కు తీసుకొచ్చినపుడు, తాము దానిని స్కాన్ చేశామని, అందులో కరెన్సీ ఉందని గుర్తించామని ఆమె ఆరోపించారు.
అయితే తాను కోర్టుకు చెప్పిన ప్రతి విషయాన్నీ ఇప్పుడు బయటకు చెప్పలేనని స్వప్న సురేష్ పేర్కున్నారు. బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే పాత్రలను చాలాసార్లు ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి పంపించేవారని ఆమె చెప్పారు. శివశంకర్ ఆదేశాల మేరకు వీటిని పంపించేవారని తెలిపారు.
ఈ ఆరోపణలపై పినరయి విజయన్ స్పందిస్తూ బంగారం స్మగ్లింగ్ గురించి వెల్లడి కాగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని గుర్తు చేశారు. న్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. అయితే రాజకీయ కారణాల వల్ల తనకు వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలను పదే పదే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదంతా ఓ ఎజెండాలో భాగమని స్పష్టం చేస్తూ నిరాధార ఆరోపణల నుంచి లబ్ధి పొందాలనుకునేవారికి కేరళ సమాజం దీటైన సమాధానం చెప్తుందని హెచ్చరించారు.