రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు చర్చంతా రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు మారుతున్నది. ఈ ఎన్నికలలో జగన్ మద్దతు నిర్ణయాత్మకం కానున్నది. బిజెపి అభ్యర్థి గెలుపొందడానికి జగన్ మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది.
గత వారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన జగన్ ఈ విషయమై చర్చించి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమ అభ్యర్థిని సునాయాణంగా గెలిపించుకోవడానికి బిజెపికి సుమారు 20 వేల ఓట్లు తక్కువగా ఉండగా, వైసీపీకి సుమారు 46 వేల ఓట్లు ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక ఇది మూడో రాష్ట్రపతి ఎన్నిక. మొదటిసారి 2012లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వున్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంది. అప్పుడే కాంగ్రెస్‌పార్టీతో విభేదించి కొత్తగా పార్టీ పెట్టినా, ఆ ఎన్నికల్లో యుపిఎ బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చింది.
2014లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ బలపరిచిన బిజెపికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతును ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతిగా వున్న రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుండ టంతో జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. కేంద్రంలో కీలకమైన అన్ని అంశాలలో బిజెపికి మద్దతుగా ఉంటూ వస్తున్న జగన్ రాష్ట్రపతి ఎన్నికలలో అందుకు భిన్నంగా వ్యవహరింపబోరని సర్వత్రా భావిస్తున్నారు.
పైగా, కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తుకున్న జగన్ ఆ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా లేవు. అయితే, వచ్చే ఏడాది ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్దపడుతున్నారని కధనాలు వస్తున్న నేపథ్యంలో బిజెపికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా జగన్ ను ఆత్మరక్షణలో పడవేసి అవకాశం ఉన్నట్లు ఆ పార్టీలో కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణా, జార్ఖండ్‌లోని అధికార పార్టీలు కేంద్రం వైఖరిపై ఆగ్రహంగా డీ అంటే డీ అన్న చందంగా రాజకీయాలు చేస్తున్నాయి. ఎన్‌డిఎ భాగస్వా మ్యపక్షమైన జెడియు కూడా కేంద్రంలోని బిజెపి ఒంటెత్తు పోకడలపై బహిరంగ విమర్శలకు దిగుతోంది.
తాజాగా, మహమ్మద్ ప్రవక్తపై బిజెపి నేతల వాఖ్యలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గల్ఫ్ దేశాలలో ఆత్మరక్షణలో పడవేశాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం వర్గాల మద్దతు జగన్ కు కీలకం కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో ఆయన మద్దతు తీవ్రమైన రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవంక, రాష్ట్రంలో కొంతకాలంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కేంద్రంలో బిజెపి అండతోనే ఆయన సిబిఐ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగేటట్లు చేయగలుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం భరోసాతోనే జగన్ నెట్టుకు వస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇటువంటి సమయంలో రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయంగా భారీ మూల్యం చెల్లింపవలసి వస్తుందని పలువురు సన్నిహితులు జగన్ ను వారిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ వ్యహాతిరేకత రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో రాజకీయంగా వేసే అడుగు కీలకంగా మారనున్నది.
అయితే తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు చిక్కుకోవడం, మరోవంక సిబిఐ, ఈడీ కేసుల నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకంగా అడుగువేసి సాహసం చేయగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే.
ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్సీపీ 45,957 ఓటు విలువ పంచుకోనుంది.