కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో జనాభాలో సింహభాగమైన బీసీ, ఎంబీసీ, సంచార జాతులు పూర్తిగా నిర్వీర్యానికి గురి చేశారని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎంబిసిల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ కుల వృత్తుల ఫెడరేషన్స్ను, బీసి కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న ఓబీసీలకు కేసీఆర్ కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని, ఇదే కేసీఆర్ గొప్పగా చెప్పే సామాజిక న్యాయమని నిలదీశారు.
సబ్సిడీ రుణాల ధరఖాస్తుల వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ కరోనా సమయంలో పూర్తిగా నష్టపోయిన కుల, చేతివృత్తిదారులకు కనీస ఆర్థిక సహాయం కూడా చేయలేదని గుర్తు చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని, ఎంబిసీల సంచార జాతుల అస్థిత్వాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో బిసి, ఎంబిసి, సంచార జాతులు అన్ని కులాలలకు సమన్యాయం చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్రమంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు 27 శాతం రిజర్వేషన్లును వర్గీకరించుటకు జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు.
కేంద్రీయ స్కూల్స్, నవోదయ స్కూల్స్ ప్రవేశాలలో బిసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించారని పెర్కొన్నారు. ప్రత్యేకంగా మత్స్యకార, పశుసంపద, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
భారతీయ జనతా పార్టీ 2014 నుండి యుపి, బీహార్ రాష్ట్రాలలో ఎంబిసి, సంచార జాతుల కులాల నుండి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పరమైన పదవుల్లో సమిచితమైన స్థానం కల్పించారని లక్ష్మణ్ వివరించారు.
తెలంగాణలోని ఓబిసీలు, ఎంబీసీలు సంచార జాతులు ప్రజలు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు. బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఎంబిసి సెల్ కన్వీనర్ దొమ్మెట వెంకటేష్ అధ్యక్షతన వహించారు. ఓబీసి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, కదగంచి రమేష్ కూడా పాల్గొన్నారు.