మాజీ సైనికులు సహా వివిధ వర్గాలతో దాదాపు రెండేళ్లపాటు విస్తృత స్థాయి చర్చలు జరిపిన తర్వాతే అగ్నిపథ్ పధకాన్ని ఏకాభిప్రాయంతో తీసుకువచ్చామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేవలం రాజకీయ కారణాలతోనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సైనికుల నియామక ప్రక్రియలో ఈ పథకం విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తుందని చెప్పారు.
ఈ పథకం కింద రక్షణ దళాల్లో నియమితులయ్యే వారికి శిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దీని గురించి తప్పుడు అపోహలను కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కొత్త పథకం కాబట్టి కొందరిలో కొంత అయోమయం ఉండవచ్చని పేర్కొన్నారు.
దేశం పట్ల ప్రజలకు క్రమశిక్షణా భావం, గౌరవభావం ఉండాలని తాము కోరుకుంటున్నామని చెబుతూ దేశంలోని సైనికుల ఆత్మస్థైర్యం దిగజారేలా చేద్దామా? అని ఆయన రాజకీయ పార్టీల నిరసనలను ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. ఈ పథకం కింద నియమితులయ్యే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారా మిలిటరీ దళాలు చేపట్టే నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుందని భరోసా ఇచ్చారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిపే నియామకాల్లోను వీరికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అగ్నివీర్ అంటే రక్షణ దళాల్లోకి కొత్తవారిని తీసుకురావడం మాత్రమే కాదని, వారికి ప్రస్తుత సైనికులకు ఇచ్చే శిక్షణతో సమానమైన శిక్షణను అందిస్తామని తెలిపారు. శిక్షణ కాలం తక్కువ అయినప్పటికీ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు.
అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ పూరత్యిన తర్వాత ఇచ్చే రూ.11.71 లక్షల ఆర్థిక ప్యాకేజి గురించి రాజ్నాథ్ ప్రస్తావిస్తూ, వారు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకుంటే అవసరమైన రుణం తక్కువ వడ్డీకి లభించేలా ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు.
నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత వీరికి ఉపాధి లభించేలా పథకాలను తమ ప్రభుత్వం రూపొందిస్త్తోందని రక్షణ మంత్రి చెప్పారు. కాగా, దేశానికి ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మన సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా రక్షణ దళాల్లో నియమితులయ్యే వారిని అగ్నివీరులుగా పిలుస్తారు.