కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై శుక్రవారం నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయించేందుకు తగు విధంగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. ముందుగానే ఈ ప్లాస్టిక్ నిషేధం అమలు గురించి ప్రచారం సాగించాయి. సంబంధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వలు చేయడం లేదా వాటిని అమ్మడం వంటి కార్యకలాపాలలో ఉన్న కంపెనీలు, ఏజెన్సీల మూసివేతకు నోటీసులు వెలువరించారు.
కాగా,ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి లక్ష రూపాయల జరిమానా, లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
19 ఎస్యూపీ వస్తువులపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించే యూనిట్లకు ఈ నెల 10వ తేదీ వరకు నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత మాత్రం చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎస్యూపీ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని మంత్రి చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయాలను అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.
ఇలా ఉండగా, తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని, ఈ ప్లాస్టిక్ వస్తువుల తయారీ అమ్మకాలతోనే బతుకుతున్నామని, కొందరికి ఉపాధి కల్పిస్తున్నామని పలువురు ఉత్పత్తిదారులు పేర్కొంటున్నారు.నిషేధం విధింపును తాము పట్టించుకోబోమని వెల్లడించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తి సంస్థలకు నిషేధం గురించి కావల్సినంత సమయం ఇచ్చామని, అదే విధంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం కుదరదని సాధారణ పౌరులకు కూడా తెలియచేశామని పలు విధాలుగా ప్రచారం చేశామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవలే స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిషేధం విధిగా అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనిని ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులు లేదా సంస్థలకు తగు కటుతర శిక్షలు ఉంటాయి. జరిమానాలు లేదా జైలు ఒక్కోసారి ఈ రెండూ అమలుపరుస్తారు. పర్యావరణ పరిరక్షణ చట్టం (ఇపిఎ) సెక్షన్ 15 పరిధిలో ఈ చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.