హర్యానాలో మైనింగ్ మాఫియా అత్యంత కిరాతకానికి ఒడిగట్టింది. నుహ్ లో రాళ్ల అక్రమ మైనింగ్‌ను ఆపడానికి వెళ్లిన ఓ సీనియర్ పోలీసు అధికారిని ట్రక్కుతో గుద్దించి.. హత్య చేసింది. ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని పచ్‌గావ్‌లో అక్రమంగా రాళ్లను తవ్వుతున్నట్లు డిఎస్పి ర్యాంక్ అధికారి సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కు సమాచారం అందింది.
ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసు బృందంలో కలిసి అక్కడకు వెళ్లగా వారిని చూసి అక్రమ మైనింగ్ పాల్పడుతున్న వారు అక్కడి నుండి పారిపోయారు. అయితే అప్పటికే లోడ్ అయి వెళుతున్న వాహనాలను ఆయన అడ్డుకున్నారు. ఓ ట్రక్కు డ్రైవర్.. వేగంగా వచ్చి పోలీసు అధికారిని ఢకొీట్టడంతో ఆయన మృతి చెందారు.
ఆ సమయంలో డిఎస్పి పక్కన ఉన్న గన్‌మన్, డ్రైవర్ పక్కకు దూకి తమ ప్రాణాలను రక్షించుకోగలిగారని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడు ఆ ప్రాంతం నుండి పారిపోయాడు. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన మృతికి హర్యానా పోలీస్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపింది. 1994లో హర్యానా పోలీసు శాఖలో ఎఎస్ఐగా నియమితులైన డిఎస్పి సింగ్ మరి కొద్దినెలల్లో రిటైర్ కానున్నారు.
కాగా, డిఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్‌ను పోలీసులు గంటల్లోనే పట్టుకున్నారు. నూహ్‌లో అతడ్ని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితుడి మోకాలిలోకి బుల్లెట్ దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడి పేరు ఇక్కార్ అని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.