రాజ్యసభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్న 19 మంది ప్రతిపక్ష ఎంపీలు వారం పాటు సస్పెండ్ అయ్యారు. సభ సజావుగా సాగకుండా నిరసనలు, ఆందోళనలతో అడ్డుపడుతున్నారనే కారణంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సభా కార్యకలాపాలను అడ్డుకొని, నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ ఎంపీలు, తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు
సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎంపీలు సభను వీడక నిరసన తెలుపుతుండడంతో సమావేశాలను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాజ్యసభ నాయకుడు, మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని, భారమైన హృదయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా చైర్మన్ విజ్ఞప్తులను వీళ్లు పట్టించుకోలేదని తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోలుకుని, పార్లమెంట్‌కు ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయెల్ వివరించారు. ఎంపీలను సస్పెండ్ చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఎంపీలను సస్పెండ్ చేయగలరు.. కానీ గొంతునొక్కలేరని పేర్కొంది.
కాగా ఏకంగా 19 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని ప్రశ్నించే అవకాశాలున్నాయి.