కేవలం మైనారిటీ విద్యా సంస్థను నిర్వహించినంత మాత్రాన ఎంఇఆర్ఇ విద్యా సంస్థకు మైనారిటీ హోదాను ఇవ్వలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం ఆ విద్యా సంస్థను మైనార్టీ సంఘం స్థాపించాల్సి ఉందని తెలిపింది.
ఆ విద్యాసంస్థను మైనారిటీ ఇన్స్టిట్యూషన్గా కొనసాగించలేమంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు కూడా చట్ట వ్యతిరేకం కాదని పేర్కొంది. ట్రస్ట్ విద్యా సంస్థ విద్యార్థుల నుండి వసూలు చేయవలసిన ఫీజును వైద్య విద్యాశాఖ ఆమోదించింది.
కొందరు ట్రస్ట్ సభ్యులు 2001లో ఓ మెడికల్ కాలేజీని స్థాపించారు. అనంతరం 2015లో ఆ ట్రస్ట్ సభ్యులు బుద్దిజమ్లోకి మారినప్పటికీ కాలేజీని కొనసాగించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పించేందుకు నిరాకరించడంతో ఆ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పూర్తి ఫీజును చెల్లించాలంటూ వైద్య విద్యాశాఖ ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ తమ విద్యా సంస్థకు మైనారిటీ హోదా కల్పించాలంటూ ఎంటివి బుద్ధిస్ట్ రెలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చట్టం 2006 ప్రకారం ఒక సంస్థ మైనారిటీ సంస్థగా అర్హత పొందాలంటే ఆ విద్యాసంస్థ కేవలం మైనారిటీలచే నిర్వహించబడే సంస్థ అయి ఉండాలి.
అంతేకాదు, మైనారిటీలే స్థాపించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని లక్నో బెంచ్ పేర్కొంది. ఒక సంస్థను స్థాపించడం, నిర్వహించడం రెండు వేర్వేరు సంఘటనలని కోర్టు పేర్కొంది.
విద్యాసంస్థను స్థాపించే సమయంలో ట్రస్ట్ సభ్యులు ఎటువంటి మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు కాదు. తర్వాత ఆ ట్రస్ట్ మైనారిటీకి మారినంత మాత్రాన విద్యా సంస్థ చట్టం 2006 ప్రకారం లేదా విద్యా సంస్థ చట్టం 2004 ప్రకారం మైనారిటీ సంస్థగా గుర్తించలేమని హైకోర్టు పేర్కొంది.