పార్ధసారధి పోట్లూరి
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనేది కేవలం ఒక ప్రచారం కోసం చేస్తున్న యాత్ర తప్పితే ఇందులో ఇటు దేశానికి గానీ,అటు కాంగ్రెస్ పార్టీకి కానీ చేసే మేలు ఏ మాత్రం ఉండబోదు.
భారత్ జోడో యాత్ర అసలే నానాటికీ తీసికట్టు చందంగా తయారవుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమైక్యత మీద విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కాస్త ఉపశమనం కోసం చేస్తున్న యాత్ర. రాజీవ్ తరువాత ఆ కుటుంబం నుండి జరుపుతున్న యాత్ర ఇదే మోదటిసారి! ఇప్పటివరకు ఇలాంటి యాత్ర చేయడానికి సాహసం చేయలేదు భద్రతా కారణాలు చూపించి కానీ గత 8 ఏళ్లుగా బిజేపి పాలనలో ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టడం వలన ధైర్యంగా బయటికి వచ్చి పాదయాత్ర చేయగలుగుతున్నాడు రాహుల్.
కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు బయటికి వెళ్లిపోతుండడం మీద చెలరేగిన విమర్శల వలన కాస్తంత ఉపశమనం కోసం అదీ మిగిలిన నాయకులు ఎవరూ పార్టీని వీడి బయటికి పోకుండా మరియు ప్రజలలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బ్రతికే ఉన్నదని చెప్పుకోవడానికి పడుతున్న తాపత్రయమే భారత్ జోడో యాత్ర.
2024 ఎన్నికల నాటికి కనీసం 150 సీట్లు గెలుచుకోవాలి అనే భ్రమని లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ చేసిన వ్యూహ రచన గా భారత్ జోడో యాత్ర అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందిర మరణం తరువాత స్వంతంగా భారీ మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటు చేశాడు రాజీవ్. కానీ ఆ తరువాత ఎన్నికలలో అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ తనంత తానుగా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. 1991 అప్పటి pv నరసింహారావు గారి ఆధ్వర్యంలో కూడా మెజారిటీ సాధించలేక బిజేపి తో సహా మిగతా రాజకీయ పార్టీల బయటినుండి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు pv నరసింహా రావు.
2004 నుండి 2014 వరకు రెండు లోకసభ ఎన్నికల్లో కూడా మిగతా రాజకీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది కాంగ్రెస్ కానీ 2014 నుండి మునపటి కంటే మరింత దిగజారిపోతూ వస్తున్నది. రాహుల్ ని బలవంతంగా ఒప్పించి యాత్ర చేయిస్తున్నట్లుగా ఉన్నది తప్పితే ప్రస్తుతం జరుపుతున్న యాత్ర తాలూకు వ్యూహ రచన చూస్తే ఎక్కడా కూడా తనకి సీట్లు రాని చోట్ల గెలవాలనే పట్టుదల అసలు కనిపించడం లేదు.
ఒక సారి రాహుల్ ప్రస్తుతం చేస్తున్న భారత్ జోడో యాత్రని ఆ రూట్ మాప్ ని పరిశీలిద్దాం:
1. తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభం అయి వెంటనే సరిహద్దులలో ఉన్న కేరళ లోకి ప్రవేశిస్తుంది. కన్యాకుమారి నుండి తిరువనంతపురం వెళ్ళే దారిలో అక్కడక్కడ ఆగుతూ చివరికి తిరువనంతపురం చేరుకుంటున్నది. పేరుకే తమిళనాడు తప్పితే ఆ రాష్ట్రంలో పర్యటన లేనే లేదు.
2 . రాహుల్ భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభం అయ్యింది కానీ మొత్తం తమిళనాడు ని తప్పించి [కన్యాకుమారి తప్పితే] యాత్ర కేరళలో ప్రవేశించి కేరళలో మొత్తంగా పూర్తి స్థాయి యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ తమిళనాడులో తమకి ఎలాంటి ప్రయోజనం ఉండదు అనే భావన కాంగ్రెస్ లో ఉంది అని భావించవచ్చు.
3. ఇక కేరళలోని తిరువనంతపురం నుండి కొచ్చిన్ వరకు ప్రధాన రహదారిలో కొనసాగుతుంది యాత్ర. మధ్యలో వచ్చే పట్టణాలలో ఆగుతూ కొద్ది సేపు కాలి నడకన తిరిగి మళ్ళీ వాహనం ఎక్కి మరో పట్టణం వచ్చేవరకు కొనసాగుతుంది కానీ చిన్న చిన్న పల్లెటూర్లలో మాత్రం తన వాహనం నుండి చేయి ఊపుతూ పలకరించడం జరుగుతుంది [అదీ అద్దెకు తెచ్చిన వాళ్ళని రోడ్ల కి ఇరువైపులా నిలుచోపెట్టి ]. కొచ్చిన్ నుండి నీలాంబూర్ వరకు కేరళలో పూర్తయి నీలంబూర్ నుండి కర్ణాటకలోని మైసూరు లోకి ప్రవేశిస్తుంది.
4. కర్ణాటకలోని మైసూరులోకి ప్రవేశించిన తరువాత అక్కడి నుండి బళ్ళారి, బళ్ళారి నుండి రాయచూరు వరకు కర్ణాటకలో యాత్ర కొనసాగుతుంది. కర్ణాటకలో కూడా మైసూరు,బళ్ళారి,రాయచూరు జిల్లాలలో మాత్రమే యాత్ర జరుగుతుంది.
5. రాయచూరు నుండి యాత్ర తెలంగాణ లోని వికారాబాద్ లోకి ప్రవేశించి అక్కడనుండి నాందేడ్ [మహారాష్ట్రలోకి ] ప్రవేశిస్తుంది యాత్ర. నిజానికి బళ్ళారి నుండి యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి జరగాలి కానీ ఆంధ్ర ప్రదేశ్ ని పూర్తిగా విస్మరించింది కాంగ్రెస్. అలాగే తెలంగాణ లోని వికారాబాద్ నుండి మాత్రమే యాత్ర మహారాష్ట్ర సరిహద్దులవరకు జరుగుతుంది తప్పితే తెలంగాణలో కూడా పూర్తిగా జరగట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో తమకేమీ లాభం ఉండదు అనే ముందస్తు నిర్ణయానికి వచ్చేసింది కాంగ్రెస్.
6. ఇక మహారాష్ట్రలో కూడా రెండే రెండు ప్రధాన పట్టణాలని కలిపే దారిలో కొనసాగుతుంది యాత్ర. అది నాందేడ్ నుండి జల్గావ్ వరకు. జల్గావ్ జిల్లా ముఖ్యకేంద్రం కానీ మధ్యప్రదేశ్ సరిహద్దులని ఆనుకొని ఉంటుంది. మహారాష్ట్రలో కూడా పాక్షికంగా యాత్ర జరుగుతున్నది.
7. జల్గావ్ నుండి మధ్యప్రదేశలోని ఇండోర్ లోకి ప్రవేశించి అక్కడ నుండి నేరుగా రాజస్థాన్ లోని కోట నగరం లోకి ప్రవేశిస్తుంది యాత్ర. ఇక్కడ కూడా ఇండోర్ ఒక్కటే పెద్ద నగరం మధ్యప్రదేశ్ లో జరిగే యాత్రలో.
8. రాజస్థాన్ లోని కోట నగరంలోకి ప్రవేశించి దౌసా,ఆళ్వార్ ల వరకు కొనసాగుతుంది యాత్ర. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వేరే ప్రాంతాలలో యాత్ర జరగట్లేదు. ఆళ్వార్ నుండి యాత్ర ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్ పట్టణంలోకి ప్రవేశిస్తుంది కానీ అది ప్రధాన రహదారిలో ఉండడం వలన తప్పని సరి అయి ఉత్తరప్రదేశ్ లో కి వెళ్తున్నది తప్పితే ఇక్కడా పూర్తిగా ఉత్తరప్రదేశ్ ని విస్మరించింది కాంగ్రెస్.
9. బులంద్షహార్ నుండి నేరుగా ఢిల్లీలోకి ప్రవేశించి అక్కడ నుండి పంజాబ్ లోని అంబాల,అంబాల నుండి పఠాన్ కోట్ వరకు ప్రయాణించి అక్కడి నుండి నేరుగా జమ్మూ లోకి ప్రవేశించి ఆ తరువాత శ్రీనగర్ లో ముగుస్తున్నది రాహుల్ యాత్ర.
ఒక సారి మొత్తం యాత్ర జరిగే ప్రదేశాలని పరిశీలిస్తే కాంగ్రెస్ కి అసలు వ్యూహం అంటూ ఉందా అనే సందేహం కలగడమే కాదు ఇది ఏదో కంటి తుడుపు యాత్రగా అదీ కాంగ్రెస్ నుండి వలసలని ఆపి సంతృప్తి పరిచే చర్యలో భాగం గా ఉంది తప్పితే వచ్చే లోక్ సభ ఎన్నికలలో 150 సీట్లలో గెలవాలి అనే లక్ష్యం దిశగా సాగుతున్నట్లుగా లేదు. కనీసం 150 సీట్లు గెలిస్తే గతంలో లాగా మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనే ఊహ చాలా కష్టజనితమయినది.
యాత్ర తమిళనాడులో మొదలయ్యినా మొత్తం తమిళనాడు ని తప్పించేశారు ఎందుకంటే మిత్ర పక్షం DMK స్టాలిన్ కి కోపం రాకూడదు కదా !
***********
ఇక కేరళలో అయితే ఎప్పుడూ రెండో సారి అధికారం అప్పచెప్పడం అనే సాంప్రదాయం అక్కడి ప్రజలకి లేదు కానీ పోయినసారి మళ్ళీ పినరయి విజయన్ కి రెండో సారి అధికారం ఇచ్చారు కానీ మూడో సారి ఇవ్వరు కనుక అక్కడ తమదే గెలుపు ఉండవచ్చు అనే భరోసా వల్ల మొత్తం కాకపోయినా కొద్దో గొప్పో కేరళలో సాగుతున్నది యాత్ర.
*********
కర్ణాటకలోని మైసూరు ప్రాంతం బిజేపి కి అంత అనుకూలమయిన ప్రాంతం కాదు. కానీ మైసూర్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు కాంగ్రెస్. కేరళ నుండి కర్ణాటకలోకి ప్రవేశించే ప్రాంతం కాబట్టి అక్కడికి యాత్ర వెళుతున్నది. మైసూరు నుండి బళ్ళారి అక్కడి నుండి రాయచూరు అక్కడి నుండి వికారాబాద్ లోకి ప్రవేశించి అక్కడనుండి నాందేడ్ లోకి వెళుతున్నది. ఇక్కడ కర్ణాటకలో కోస్తా ప్రాంతం లో బిజేపి బలంగా ఉంది కానీ అటువైపు చూడట్లేదు అంటే అర్ధం ఏమిటీ ? బిజేపి బలంగా ఉన్న చోట ప్రచారం చేస్తేనే కదా కొద్దో గొప్పో వోట్లు పడేది ? అలాగే కర్ణాటకలోని కోంకణ్ ప్రాంతంలో కూడా బిజేపి బలంగా ఉంది కానీ ఈ ప్రాంతాన్ని కూడా విస్మరించింది కాంగ్రెస్.
*********
మహారాష్ట్రలో నాందేడ్ నుండి జలగావ్ వరకు బిజేపి కి పట్టులేని ప్రాంతం అదే సమయంలో శరద్ పవార్ కి వోట్లు పడే చెరుకు పండించే ప్రాంతం కానీ ఈ దారిలో కూడా ఎక్కువగా ప్రచారం చేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ ప్రాంతం NCP కి పట్టు ఉన్న ప్రాంతం కాబట్టి కాంగ్రెస్ కి ఒరిగేది ఏమీ ఉండదు.
*********
భారత్ జోడో యాత్ర అనేది కాంగ్రెస్ కి ఏమాత్రం గెలుపుని ఇచ్చే యాత్ర కానే కాదు. శత్రువు కోటలోకి వెళ్ళి యుద్ధం చేస్తేనే విజయం వరిస్తుంది కానీ కోట బయట నుండి సైన్యాన్ని తీసుకెళితే కాదు. ఎక్కడయితే బిజేపి కి పట్టు ఉన్నదో ఆ ప్రాంతాలని విస్మరించడం కాంగ్రెస్ బలహీనత ని చెప్పకనే చెప్తున్నది. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,ఒరిస్సా,పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్,గుజరాత్,బీహార్,మరియు ఈశాన్య రాష్ట్రాల లో యాత్ర ఎందుకు చేయట్లేదు ?
***************
కాంగ్రెస్ పార్టీకి నిజంగానే 2024 ఎన్నికలలో తన వంతుగా 150 సీట్లు గెలవాలి అనే ఆలోచన ఉంటే ఇలాంటి కంటి తుడుపు యాత్రని చేపట్టి ఉండేది కాదు. ఇది కేవలం కాస్తో కూస్తో కాంగ్రెస్ కార్యకర్తలకి ఉత్సాహం ఇస్తుందే కానీ వోట్లు రాల్చదు. మొత్తానికి రాహుల్ బయటికి వచ్చి ప్రజలతో మమేకం అయ్యాడు అని చెప్పుకోవడానికి పనివస్తుంది తప్పితే ఎలాంటి ఎన్నికల ఫలితాన్ని ఇవ్వబోదు.
జైహింద్ !