వచ్చే శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని రాష్ట్రంలోని 175సీట్లను కూడా గెలుచుకుంటామని భరోసా వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్కలు తప్పుతున్నాయా? ఆయనే స్వయంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొంతమందితో సహా 27 మంది ఎమ్యెల్యేలు తిరిగి గెలుపొందే అవకాశం లేదని తేల్చి చెప్పేయడంతో పలువురు అధికార పక్ష నేతలు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.
గెలుపొందగల అవకాశాలు గలవారికి మాత్రమే సీట్లు ఇస్తామని స్పష్టం చేస్తూ మంత్రులైనా, ఎంతటి ముఖ్యనేతలైనా పనితీరు బాగాలేని పక్షంలో సీట్ ఇచ్చే ప్రసక్తి లేదని అంటూ ఓ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే సీటు ఎవ్వరికీ ఇవ్వడం లేదు చెబుతానని కూడా వెల్లడించారు.
నవంబర్ లో మరోసారి సమీక్ష చేస్తానని చెబుతూ పనితీరు మెరుగు పరచుకోలేని పక్షంలో వారికి తిరిగి సీట్ ఇవ్వడం సాధ్యం కాదని అంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం సీట్లలో పాగా వేయాలన్న పథకంలో భాగంగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో జగన్ బుధవారం సమావేశమై చర్చించారు.
వాడివేడిగా సాగిన ఈ సమావేశంలో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఖరాకండితంగా చెప్పారని, పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదని చెప్పినట్లు సమాచారం. నేతల పనితీరుపై ఐప్యాక్ ఇచ్చిన నివేదికపై జగన్ సమీక్షించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సమీక్షించిన పార్టీ అధినేత జగన్ 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పినట్లు తెలుస్తున్నది. వారి పేర్లను కూడా ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఐప్యాక్ ఇచ్చిన ప్రోగ్రేస్ రిపోర్ట్ ఆధారంగా వారికి క్లాస్ తీసుకున్నట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ వారు చేస్తున్న తప్పిదాలను బయటకు వెల్లడిస్తున్నారని నాయకులు చెప్తున్నారు. ఇదే సమయంలో ఎందుకలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలువురకి ఇలా చేయొచ్చు కదా అంటూ దశ దిశ చేసినట్లు సమాచారం.
ఎమ్మెల్యేలు కొందరు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తమాషాగా తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా చేస్తున్న వారిని పేరుపేరునా చెప్తూ వీరంతా తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారంట. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది.