రైతుల కోసం కొత్త పథకాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారంనాడు ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులు రూ.50,000 వరకూ ప్రోత్సహకాలను అందుకుంటారు. స్వల్పకాలిక రుణాలను పూర్తిగా చెల్లించిన వారికి ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి.
”మహాత్మా జ్యోతిరావ్ ఫులే ఫార్మర్స్ డెబ్ట్ రిలీఫ్ స్కీమ్”లో భాగంగా ఈ ప్రోత్సాహకాలను రైతులు అందుకుంటారు. 6.90 లక్షల మంది రైతుల అకౌంట్లలో ప్రభుత్వం రూ.2.500 కోట్లు డిపాజిట్ చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిన తొలి రాష్ట్రం క్రెడిట్ మహారాష్ట్రకు దక్కుతుందని చెప్పారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, ఈ పథకానికి అర్హులు కావాలంటే వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2017-18, 2018-19, 2019-20) రెండు ఆర్థిక సంవత్సరాలు పూర్తి రుణం చెల్లించి ఉండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్ 30 లోగా రుణాలు చెల్లించవచ్చు. తీసుకున్న రుణం మొత్తం రూ.50,00 కంటే తక్కువ ఉంటే, వారు తీసుకున్న మొత్తం రుణానికి సమానంగా ప్రోత్సాహకాలు పొందుతారు.
స్వల్పకాలిక రుణాన్ని ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో తీసుకుంటే ఆ రుణాలను పరిగణనలోకి తీసుకుని రూ.50,000 వరకు ప్రోత్సాహకాలు అందుకుంటారు. రైతులకు దీపావళి స్వీటుగా బెనిఫిట్ మొత్తాన్ని దీపావళికి ముందే వారి ఖాతాల్లో జమ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు సీఎం తెలిపారు.