మునుగోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్సమగ్ర దర్యాప్తు చేపట్టి, శిక్షించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసే కేసీఆర్ ప్రభుత్వ చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా నియోజకవర్గంలో పని చేస్తున్న బిజెపి నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, ఇది చాలా చట్టవిరుద్ధమని, తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు.
చట్టపరమైన ప్రక్రియ లేకుండా ఎవరి టెలిఫోన్ అయినా ట్యాప్ చేయడానికి చట్టం అనుమతించదని ఆయన తెలిపారు. బిజెపి నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.
‘‘ఎమ్మెల్యేల కొనుగోలు’’ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా బిజెపిపై తప్పుడు ఆరోపణలు గుప్పిస్తూ, బిజెపిని బద్నాం చేయడానికి, ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
థర్డ్ పార్టీ ద్వారా కొంతమంది నాయకుల బ్యాంకు వివరాలను సేకరిస్తున్నారని విమర్శించారు. కొన్ని సంస్థల, కొంతమంది వ్యక్తుల బ్యాంకింగ్ లావాదేవీలపై విచారణ చేస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా చెప్పడాన్ని ఎత్తిచూపారు. టీఆర్ఎస్, ఆ పార్టీ నాయకుల చర్యలు భారత శిక్షాస్మృతి ప్రకారం నేరంగా పరిగణించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తుందని పేర్కొంటూ వాటి విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. గూగుల్ పే, ఫోన్ పే వంటి మనీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ల ద్వారా టీఆర్ఎస్ నేరుగా ఓటర్లకు నగదు బదిలీ చేస్తోందని తరుణ్ ఛుగ్ విరుచుకుపడ్డారు. గత ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఇదే విధానాన్ని అవలంబించిందని ఆయన ఈసీకి తెలిపారు.కేసీఆర్ అక్రమాలపై న్యాయ విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
`సుప్రీం’ను ఆశ్రయించిన నిందితులు ఇలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సుప్రీంకు చేరింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన సీజేఐ దాన్ని శుక్రవారానికి లిస్ట్ చేయాలని ఆదేశించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి ఉన్నారు. షేక్‌పేటలోని హిల్‌టాప్ అపార్ట్మెంట్ నుంచి వీరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు నిందితులను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. వారి రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్ ను విచారించిన హైకోర్టు ముగ్గురు నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.