రాజ్యసభలో ప్రతిపక్షం “గందరగోళం, అంతరాయం” మంత్రంతో పని చేస్తుందని బిజెపి తీవ్రంగా ఆరోపించింది. 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ కారణంగా సభలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం పిలిచిన సమావేశానికి ఐదు ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరుకాకపోవడంతో, సభ నడవడంవారికి ఇష్టం లేదని వెల్లడైనదని విమర్శించింది.
గత సమావేశాలలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేనతో సహా ఈ పార్టీలు – రాజ్యసభలో వికృతంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఈ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం మొత్తం ప్రతిపక్షాలను సమావేశానికి పిలిచి ఉండాల్సిందని వాదించాయి.
రాజ్యసభలో సభానాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు సభను నడపడానికి ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. “వారు సమావేశంకు హాజరై తమ అభిప్రాయాన్నిచెప్పి ఉండవలసింది. అప్పుడు ప్రభుత్వం అందరినీ ఆహ్వానించి ఉండవచ్చు,” అని ఆయన పేర్కొన్నారు,
రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు ఐదు పార్టీల నాయకులను పిలిచామని పేర్కొంటూ ఆయన ఒక పరిష్కారం కనుగొనడానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోవాలని కోరుకున్నారని గోయల్ తెలిపారు.
2010లో ఏడుగురు విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రస్తావించారని, ఆ తర్వాత వారిని సభలో పాల్గొనేందుకు కొనసాగించేందుకు అనుమతించారని చెప్పారని గుర్తు చేస్తూ అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సభకు క్షమాపణ చెప్పిన తర్వాతనే వారి సస్పెన్షన్‌ను రద్దు చేశామని గోయల్ అప్పటి మినిట్స్ ను చూపిస్తూ వెల్లడించారు.
అప్పుడు కూడా, ఏడుగురు సభ్యులలో ఒకరి సస్పెన్షన్ కొనసాగించారని, అయితే సస్పెండ్ అయినా ఏడుగురిలో బిజెపి సభ్యులు ఎవ్వరు లేరని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేతగా జైట్లీ చొరవ తీసుకొని, సమస్య పరిష్కారం కోసం విచారం వ్యక్తం చేశారని గోయల్ చెప్పారు.
ఇప్పుడు కూడా, సస్పెండ్ చేయబడిన 12 మంది ఎంపీలు పార్లమెంటు, చైర్ రెండింటి గౌరవాన్ని పునరుద్ధరించడానికి క్షమాపణలు చెప్పాలని, ఆ విధంగా చేయడం వారిని ఏమాత్రం తక్కువ చేయదని బిజెపి సీనియర్ నాయకుడు పేర్కొన్నారు.
గోయల్‌తో కలిసి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, సస్పెండ్ చేయబడిన సభ్యులను తిరిగి పార్లమెంటు కార్యకలాపాలకు అనుమతించే ముందు తమ ప్రవర్తనకు వారు క్షమాపణలు చెప్పడం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నదని తెలిపారు.