కేసీఆర్ సర్కారు, ఆయన కుటుంబం సంపాదించిన అక్రమ సంపాదన కూడా ప్రజలకే చెందాలని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ డా. కె. లక్ష్మణ్ డిమాండ్
చేశారు. యూపీలో అక్రమంగా సంపాదించినోళ్ల నుంచి రూ.12 వేల కోట్లను యోగి సర్కారు స్వాధీనం చేసుకుందని ఆయన గుర్తుచేశారు.
ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ సంపాదన ఎంత, ఇప్పుడు ఎంతనేది అందరికీ తెలుసని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలులో రాష్ట్ర బీజేపీ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా ప్రగతి భవన్ లోనే తయారయిందని ఆరోపించారు.
ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు వేరే పార్టీ నుంచి గెలిచిన వారేనని, వాళ్లను ఏమిచ్చి టీఆర్ఎస్లో చేర్చుకున్నారో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే వాళ్లను ప్రగతి భవన్లో 4 రోజులు ఎందుకు దాచినవని మండిపడ్డారు.టీఆర్ ఎస్ నుంచి 85 మంది గెలిస్తే మరో 20 మందిని ఎందుకు కొన్నావని సీఎంను ఆయన ప్రశ్నించారు. తప్పు చేయకపోతే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చీకటి జీవో ఎందుకు తెచ్చారని కేసీఆర్‌పై లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
చేనేతమీద జీఎస్టీ విధింపుపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అబద్ధాలు ఆడుతున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతపై జీఎస్టీని 2017 లో అప్పటి ఆర్థిక మంత్రి అంగీకరించినట్లు హరీశ్ చెప్తుంటే, కేటీఆర్ మాత్రం జీఎస్టీ 5% ఉండాలని తాను కోరానని అన్న వీడియోను లక్ష్మణ్ తన మొబైల్లో మీడియాకు చూపించారు. చేనేతకు 2.5 జీఎస్టీ రాష్ట్రానికి వస్తుందని, దానిని ఎందుకు వదులుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖరారవడంతో ఆ పార్టీ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఈటల రాజేందర్ కాన్వాయ్, సిబ్బందిపై టీఆర్ ఎస్ రౌడీలు దాడి చేయడాన్ని మంగళవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడకుండా సంయమనం పాటించాలని కోరారు.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డా. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. చార్మినారి వెళ్లిన రాహుల్.. భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎందుకు దర్శించుకోలేదు? అని రాహుల్‌ను ప్రశ్నించారు.
రాహుల్ మెప్పు కోసం టీకాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని, పీవీ విగ్రహానికి ఎందుకు నివాళులర్పించలేదో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. దీనిపై పీవీతో కలిసి పనిచేసిన ఖర్గే స్పందిచాలని లక్ష్మణ్ కోరారు. గాంధీ కుటుంబానికి బానిసలుగా ఉన్నవారికి మాత్రమేవిలువ ఉంటుందని మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు.