దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ శుక్రవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 14న నామినేషన్ల గడువు ముగియనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 ఆఖరి తేదీగా నిర్ణయించారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో వెంటనే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని విజయ్ దేవ్ పేర్కొన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నదని ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ చెప్పారు. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, అందులో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలని ఆయన తెలిపారు.