దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
నామా నాగేశ్వరరావు నేతృత్వంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సుమలత అంబరీష్, ఎల్ హన్మంతయ్య, శాంతా కుమారి, ఎ. గణేశమూర్తి,పి. స్వస్తి సుందరం చియాతో పాటు చెరకు రైతు సంఘాల నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకత్వంలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి చెరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
చెరకు రేటు విషయంలో దక్షిణాది రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, చెరకు రికవరీ రేటు 10.25కి పెంచడం వల్ల దిగుబడి తగ్గి, తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్రమంత్రికి వివరించారు. గతంలో మాదిరిగానే రికవరీ రేటును 8.5కి తగ్గించాలని కోరారు. దిగుబడి తక్కువగా ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు రూ.525 కోట్ల మేర నష్టపోతున్నారని వివరించారు.
రికవరీ పద్ధతిలో కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి టన్నుకు ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరంలో క్వింటాకు రూ.305 గా నిర్ణయించిన ఎఫ్ఆర్పీ ధరను సమీక్షించి రూ.350కి పెంచాలని ఎంపీలు, రైతుల బృందం విజ్ఞప్తి చేసింది. చెరకు కోత, పెరిగిన రవాణా ఖర్చు, ఎరువుల ధర ఎఫ్ఆర్పీ పెంపునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
చెరకు కోత, రవాణా 15- 16 నెలలు కావడం వల్ల రైతులు రుణాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోందని కేంద్రమంత్రికి తెలిపారు. 12 నెలల తర్వాత అలస్య కాలానికి 15 శాతం వడ్డీని కలిపి, ఉత్తర్వులు ఇవ్వాలని లేదా చెరకు రుణ వాయిదా చెల్లింపుల్లో జాప్యం కారణంగా చెరకు పంట రుణానికి 20 నెలల చెల్లింపు వ్యవధిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.