కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో గుంపులుగా చేరితే వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉత్సవాలపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తూ.. మరో వైపు కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఆంక్షలు పెడుతున్నాయి.
ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలను ప్రకటించగా, తాజాగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాయి. దేశ రాజధాని పరిధిలో గుంపులుగా చేరి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడంపై నిషేధం విధిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా ఢిల్లీ పోలీసులు, జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, పరిస్థితులపై రోజువారీగా రిపోర్ట్ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కెట్లలో షాపింగ్‌కు వెళ్లే వాళ్లు మాస్క్ పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
నో మాస్క్.. నో ఎంట్రీ నిబంధనను పక్కాగా అమలు చేసేలా మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్లను ఆదేశించింది డీడీఎంఏ. అలాగే పండుగలు, వినోద, సాంస్కృతిక, రాజకీయ, క్రీడా కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు డీడీఎంఏ ప్రకటించింది.
అయితే బార్లు, రెస్టారెంట్లు లాంటివి 50 శాతం సీటింగ్‌తో ఓపెన్ చేసుకోవచ్చని, పెళ్లిళ్లు లాంటివి ఫంక్షన్లు 200 మంది అతిథులతో జరుపుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా ఢిల్లీలోనే 57 కేసులు ఉన్నాయి. దీంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పబ్లిక్ గ్యాదరింగ్స్‌పై ఆంక్షలు పెట్టాలని, అవసరమైతే నైట్ కర్ఫ్యూలు విధించాలని చెప్పింది.
ఉత్తర ప్రదేశ్ లో కూడా ఈ విధమైన వేడుకలపై ఆంక్షలు విధించారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను అరికట్టేందుకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు లక్నో పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ తెలిపారు. తాజా క్రమంలో, ఎవరైనా కరోనా ప్రోటోకాల్‌లను ఉల్లంఘిస్తే జరిమానా విధించబడుతుందని ఆయన హెచ్చరించారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వ్యక్తులను తనిఖీ చేయడానికి రోడ్లపై, ముఖ్యంగా బార్లు, క్లబ్‌లు, లాంజ్‌ల దగ్గర చెక్‌పోస్టులు, బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాల్స్ మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తామని ఆయన తెలిపారు.
కర్ణాటకలో, డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే, భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. టీకాలు వేసుకోని వారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
పబ్ ల్లో ప్రవేశం 50 శాతం సామర్థ్యానికి పరిమితం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఎత్తున పార్టీలను అనుమతించడం లేదని సృష్టం చేసింది. అపార్ట్మెంట్లలో డీజేలు ఉపయోగించకుండా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50 శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ హైకోర్టు కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది.
క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని కోర్టు సూచించింది. రాష్ట్రాల సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇలా ఉండగా, రెండు వ్యాక్సిన్లు తీసుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. పెళ్లి మండపాలు, హోటళ్లు, బ్యాంకులు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించబోమని హర్యానా ఆరోగ్యశాఖామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. టీకాలు తీసుకోనివారు బస్సు ప్రయాణాలు చేయడానికి కూడా వీల్లేదన్నారు. గుజరాత్లో ఈ నెల 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.