ప్రముఖ కవి, గేయరచయిత జావేద్ అక్తర్ పాకిస్తాన్‌పై ఆ దేశంలోనే ఘాటు విమర్శలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులు లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్మారకార్థం లాహోర్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గతవారం జావేద్ పాకిస్తాన్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకులతో నిర్వహించిన ముఖాముఖీలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ద్వేషాన్ని వెదజల్లడం సరికాదని జావెద్ అక్తర్ హితవు చెప్పారు.
ఉర్దూ భాష కవి ఫయిజ్ అహ్మాద్ ఫయిజ్ జ్ఞాపకార్ద వేడుకల్లో జావెద్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఆర్టిస్టులకు పాక్‌లో గౌరవం దక్కలేదని, కానీ ఇండియాలో మాత్రం పాక్ కళాకారులు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఫయాజ్ సాహెబ్ వచ్చినప్పుడు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, అంతటా బ్రాడ్కాస్ట్ చేశామని గుర్తు చేశారు.
అదే విధంగా, నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహిదీ అసన్ వచ్చినప్పుడు ఫంక్షన్ చేశామని, కానీ మీరెప్పుడు లతా మంగేష్కర్‌కు గౌరవ సభ ఏర్పాటు చేయలేదని జావెద్ మండిపడ్డారు. అక్తర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గాలని ఆయన సూచన చేశారు. దీనికి భారత్ ను నిందించడం సరికాదని హితవు చెప్పారు. పాక్‌లో మంచి వాళ్లు ఉన్నారని, వాళ్లు బాంబులు వేయడం లేదని, పూలమాలలు వేస్తున్నారని, దీనికి మీరేమంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఒకరిపై ఒకరు నిందలు చేసుకోవడం సరికాదన్నారు. దాని వల్ల సమస్య పరిష్కారం కాదని చెప్పారు.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చాలని చెబుతూ తాను ముంబైకి చెందినవాడినని, తమ నగరంపై ఉగ్రదాడి జరగడం చూశానని గుర్తు చేశారు. వాళ్లేమీ నార్వేనో లేక ఈజిప్టు నుంచి రాలేదని, కానీ వాళ్లు మాత్రం పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని స్పష్టం చేశారు. అందుకే భారతీయుల గుండెల్లో కోపం ఉందని, దానిపై ఫిర్యాదులు అవసరం లేదని జావెద్ తేల్చి చెప్పారు.