దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గత రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు (ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని ప్రకటించారు.
క్రిస్మస్, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలను హెచ్చరించారు.
డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి కూడా అదనపు డోసు ఇస్తారని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కరోనాపై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ప్రధాని భరోసా ఇచ్చారు. దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయిని చెప్పారు.
పైగా, పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామని వివరించారు.
కాగా, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు. భారత్‌లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు.