తెగల మధ్య ఘర్షణలతో కొన్నాళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో హృదయవిదారకమైన ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి, వారి బంధువు నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు.
పశ్చిమ ఇంపాల్లోని ఇరోసింబా ప్రాంతంలోని ఓ శరణార్థుల శిబిరం సమీపంలో మెయితీ–కుకీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ బులెట్ వచ్చి బాలుడు తాన్సింగ్ (8) మెదడులోకి దూసుకెళ్లింది. హుటాహుటిన సిబ్బంది.. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
తోడుగా బాలుడి తల్లి మీనా, లైడియా అనే వారి బంధువూ వాహనంలోకి ఎక్కారు. అంబులెన్స్ ఆస్పత్రికి వెళుతుండగా ఓ దుండగుల మూక అడ్డుకొని ఆ వాహనానికి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దహనమైంది. డ్రైవర్ తప్పించుకోగా.. వాహనంలో బాలుడు, అతడి తల్లి, వారి బంధువు సజీవదహనమయ్యారు.
నెలరోజులకుపైగా అట్టుడుకుతున్న మణిపూర్ నిరసనల సెగ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తాకింది. కుకి సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు ఢిల్లీలోని అమిత్ షా ఇంటి వద్ద నిరసనలకు దిగారు. కుకి గిరిజనుల జీవితాలను కాపాడాలంటూ వారు నినదించారు.