దేశంలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నా, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా ఐదు రాష్ట్ర అసెంబ్లీలకు ఫిబ్రవరిలో జరుగవలసిన ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే జరపడం పట్ల ఎన్నికల కమీషన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో పర్యటించిన ఎన్నికల కమీషన్ సభ్యులు మంగళవారం నుండి మూడు రోజులపాటు ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తయిన తర్వాతనే ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
కరోనా మహమ్మారి దృష్ట్యా ఎన్నికలను రెండు, మూడు నెలలపాటు వాయిదా వేయమని అలాహాబాద్ హైకోర్టు సహితం ఎన్నికల కమీషన్ కు సూచించడం తెలిసిందే. అయితే సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించింది.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కవరేజీ, ఓమిక్రాన్ కేసుల వివరాలను ఎన్నికల సంఘం కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందన్న వాదనలపై కఠినమైన కొవిడ్ ప్రోటోకాల్ ఆవశ్యకతపై కూడా ఎన్నికల సంఘం చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్, గోవాల్లో అర్హులైన 100శాతం జనాభా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. యూపీలో 85శాతం మందికి ఫస్ట్ డోసు ఇవ్వగా.. మణిపూర్, పంజాబ్ లో టీకా తీసుకున్నవారి సంఖ్య 80 శాతం కన్నా తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఈసీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రానికి సూచించింది.
అంతేకాదు పంజాబ్, గోవా ఎన్నికల్లో డ్రగ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవంక, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో బహిరంగసభలు, భారీ ర్యాలీలను అదుపు చేసే విషయమై ఎన్నికల కమీషన్ ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తున్నది.
ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఐటీబీబీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాలతో ముడిపడిన అంతర్జాతీయ సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన సూచనలిచ్చింది.