30 ఏళ్ళ క్రితం జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద విస్ఫోటనం తర్వాత మొదటిసారిగా క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోయింది. క్రియాశీలకంగా ఉన్న స్థానిక తీవ్రవాదుల సంఖ్యా 86గా మాత్రమే ఉంది. ఈ విషయాన్ని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ శ్రీనగర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఓసి)తో విలేకరుల సమావేశంలో తెలిపారు.
15 కార్ప్స్, లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే, అనంతనాగ్ ఎస్ ఎస్ పి ఆశిష్ కుమార్ మిశ్రాలతో కలసి దక్షిణ కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లోని వుజూర్ ప్రాంతంలోని 2 సెక్టార్ ఆర్ ఆర్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తాజాగా,అనంత్‌నాగ్, కుల్గామ్‌లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు జైష్-ఎ-మహమ్మఫ్ (జెఎమ్) ఉగ్రవాదులు హతమైన సంఘటనల వివరాలను పంచుకోవడానికి విలేకరుల సమావేశం జరిగింది. ఒక జవాను కూడా మరణించగా, ఒక పోలీసు, ఒక సైనికుడు గాయపడ్డారు.
“చనిపోయిన సైనికుడిని సిపాయి జస్బీర్ సింగ్‌గా గుర్తించారు” అని పాండే చెప్పారు. గాయపడిన వారు నిలకడగా ఉన్నారని తెలిపారు. విదేశీ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లలో హతమవుతున్నారని, స్థానిక ఉగ్రవాదులు తమ సొంత సవాళ్ల కారణంగా బలగాలపై దాడి చేయడానికి నిరాకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
విదేశీ ఉగ్రవాదులు తాము దాగి ఉన్న ప్రదేశాల నుండి బయటకు వచ్చినప్పుడు వారిని చంపివేయడం ఖాయం అని హెచ్చరించారు. హతమైన జేఈఎం మిలిటెంట్ల నుంచి అమెరికాలో తయారైన ఒక ఎం-4 కార్బైన్, ఎనిమిది మ్యాగజైన్లు, రెండు ఏకే 47 రైఫిళ్లు, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మిశ్రా తెలిపారు.
గత ఐదు రోజుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కుమార్ చెప్పారు. గత ఏడాది 180 మందితో పోలిస్తే 2021లో 128 నుండి 130 మంది స్థానికులు మాత్రమే మిలిటెన్సీలో చేరారని పేర్కొన్నారు.
మిలిటెంట్ రిక్రూట్మెంట్ గురించి వివరిస్తూ, ఈ ఏడాది మిలిటెన్సీలో చేరిన 128 మంది స్థానిక ఉగ్రవాదులలో 73 మంది మరణించారని, 17 మందిని అరెస్టు అయ్యారని, కేవలం 39 మంది చురుకుగా ఉన్నారని ఐజిపి కశ్మీర్ వివరించారు.