హుజురాబాద్ ఉపఎన్నికల ఓటమితో దిక్కుతోచక, ప్రజల దృష్టి మళ్లించడం కోసం, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన వరి రాజకీయం ఆయన ప్రభుత్వాన్నే రాజకీయంగా సుడిగుండంలోకి నెట్టుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్న్యాయంగా బీజేపీ ప్రజల దృష్టిని ఆకట్టుకొంటూ ఉండడంతో తట్టుకోలేక, అర్ధాంతరంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు ప్రారంభించారు.
మొన్నటి వరకు మద్దతు ఇస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పురా బట్టడా ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన మంత్రులు కూడా పల్లవి అందుకొంటున్నారు. అంతటితో ఆగక పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా వడ్ల కొనుగోలుపై అసత్య కథనాలతో నిరసనలకు దిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ వినిపించుకోకుండా ఉభయ సభలలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేశారు.
తాము చేస్తున్న నిరసనలకు మరెవ్వరు మద్దతు ఇవ్వక పోగా, ఇతర పార్టీల దృష్టిలో చౌకబారుగా తేలుతున్నట్లు గ్రహించి సమావేశాలను బహిష్కరించి, అందరిని హైదరాబాద్ కు తిరిగి రమ్మనమని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపి, తమను కేంద్ర మంత్రులు ఎవ్వరు కలవడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తిరిగి వచ్చారు. అజాగ్రత్తగా ఉండడంతో వారిలో కొందరు కరోనా బారిన పడ్డారు.
తాడో పేడో తేల్చుకు వస్తానని డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఇల్లుదాటి బైటకు రాకుండా, మౌనంగా తిరిగి రావడం చూసాం. కేవలం తామేదే కేంద్రంపై పోరాటం చేస్తున్నామన్న అభిప్రాయం ప్రజలలో కలిగించడం ద్వారా, సానుభూతి పొందాలనే తపన తప్పా అసలు సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి కనిపించనే లేదు.
కేంద్రం అనుమతించిన మేరకు కూడా వడ్లు కొనకుండా, కొన్న వాదులకు అందరికి డబ్బు ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు. వారి పండించవద్దు, అది దండుగ అంటూ ప్రచారం చేసిన కేసీఆర్ స్వయంగా తన ఫామ్ హౌస్ లోని 150 ఎకరాలలో వారి సాగు చేస్తున్నారని విమర్శలు రావడం ఆయనను ఆత్మరక్షణాలు పడవేసింది.
రైతులను వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్ లో మాత్రం వరి పంటనే సాగు చేస్తుండడం జనంలో చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు యాసంగిలో రైతులు వరేస్తే ఉరే అన్న టీఆర్ఎస్ నేతలు.. ఫాంహౌస్ లో వరిసాగు బయటపడటంతో ఏం చెప్పాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు.
వరి వేస్తే ఉరే…. రైతులు యాసంగిలో వరేస్తే మాకైతే జిమ్మిదారి లేదు.. మీ పంటకు మీరే బాధ్యులని రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. కానీ తన ఫాంహౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేయటం రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రైతులందరినీ ప్రశ్నార్థకంలోకి నెట్టి సీఎం మాత్రం వరి వేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇదేం విడ్డూరం.. మమ్మల్ని వద్దని.. తను వరి వేయటం ఏంటని రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఫాంహౌస్ లో వరిసాగు టీఆర్ఎస్ నేతలను ఇరుకున పెడుతోంది. మొన్నటివరకు యాసంగిలో వరి వేయొద్దని బల్లగుద్ది చెప్పిన టీఆర్ఎస్ నేతలు సందిగ్ధలో పడ్డారు.
సీఎం కేసీఆర్ వరి వేయడంపై ప్రతిపక్షాలకు మంచి అస్త్రం దొరికనట్లైంది. ఏ కంపెనీతో ఒప్పందం చేసుకొని సీఎం కేసీఆర్ వరి వేశారో చెప్పాలని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో అవగాహనతో, రైతులను ఆదుకొనే ప్రయత్నం చేయకుండా రాజకీయ లబ్ధికోసం పాకలాడుతూ ఉండడంతో ఇప్పుడు అధికార పక్షం నేతలు ప్రజల దృష్టిలో దోషులుగా నిలబడవలసి వస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం తొలి నుండి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. కాంట్రాక్టర్ల నుండి భారీ ముడుపుల కోసం ఒక ప్రణాళిక లేకుండా సాగునీటి ప్రాజెక్ట్ లు నిర్మించడం తప్పా, అత్యవసరమైన వాటిని పట్టించుకొనక పోవడంతో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు కూడా అదనపు సాగు సదుపాయం కల్పించలేక పోతున్నది.
వరి రాజకీయాలలో మునిగిపోయిన ప్రభుత్వంలో పంటల విషయంలో ముందుచూపు లోపిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వాలూఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. కోటి ఎకరాల మాగాణి అని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.
ప్రభుత్వ ధోరణిపై గతంలోనే నిపుణుల నుండి హెచ్చరికలు వచ్చాయి. అయినా ఖాతరు చేయలేదు. రోజుకు మూడు పూటలా అన్నం తిన్నా కూడా.. తెలంగాణకు కావాల్సింది 70 లక్షల టన్నులు మాత్రమే. కానీ రాష్ట్రంలో నేడు వరి ఉత్పత్తి కోటి టన్నులకు మించింది. దీంతో బియ్యం నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంతో పెద్ద భూస్వాములకు మాత్రమే లాభం చేకూరుతోందనే వాదన బలంగా ఉంది. చిన్న, సన్నకారు రైతులకు ఏమాత్రం లాభం చేకూరడం లేదు. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 60 శాతానికి పైగా కౌలుదారులే. కానీ, ఈ పథకం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా.. ఆ ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చిందో రైతులకు తెలియదు. వ్యవసాయంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నా.. ఆ మేరకు దిగుబడి రావడం లేదు. సాగు కోసం రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.
దీనికి తోడు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం తదితర కారణాల వల్ల అప్పులు మరింతగా పెరుగుతున్నాయి. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కదలిక ఉండడం లేదు. సంకుచిత రాజకీయాలకు స్వస్తి పలికి, రైతు పక్షాన ప్రభుత్వం నిలబడి, వారికి అండగా ఉండాలి. లేని పక్షంలో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.